భోగిమంటల్లో పీపీపీ జీఓ ప్రతుల దహనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో ‘పీపీపీ’ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, జీఓలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్ సీపీఐ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భోగిమంటలలో జీఓ పత్రాలను దహనం చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ జీవోలను రద్దు చేయకపోగా 100 శాతం వైద్య విద్యను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్, వలి మాట్లాడారు. విద్యార్థి నాయకులు యశ్వంత్ రఘువీర్, అమర్నాథ్, చల్లా మరియదాసు, అజయ్, సాయి గణేష్ పాల్గొన్నారు.


