కారంచేడు: యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ (కం) ఉన్నత పాఠశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభిస్తున్నామని గుంటూరు ఆర్‌జేడీ బీ లింగేశ్వరరెడ్డి అన్నారు. కారంచేడు గ్రామంలో విద్యాదాతలు యార్లగడ్డ వెంకన్న చౌదరి, యార్లగడ్డ రంగనాయకులు చౌదరిలచే 1956లో చల్లపల్లి రాజా చేతుల మీదగా దీనిని ప్రారంభించారు. బుధవారం బాపట్ల డీఈఓ ఎస్ పురషోత్తంతో కలిసి ఆర్‌జేడీ పాఠశాల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పాఠశాల కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు దీనిపై రాష్ట్ర పాఠశాలల విద్యా కమిషనర్ విజయరామరాజును కలిసి విన్నవించారన్నారు. ఉన్నత పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారన్నారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 2025–26 సంవత్సరాలకు సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. మాజీ ఎంపీపీ యార్లగడ్డ రాఘవయ్య మాట్లాడుతూ అవసరమైన సహకారం అందిస్తామన్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కూడా ఆర్‌జేడీ పరిశీలించారు. ఈ పాఠశాలను మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేస్తామని బాపట్ల డీఈఓ ఎస్ పురుషోత్తం తెలిపారు. అందుకు అవసరమైన అదనపు తరగతి గదులను పాఠశాలకు అప్పగించాలని ఆయన గ్రామ సర్పంచ్ బాలిగ శివపార్వతిని కోరారు. కార్యక్రమంలో చీరాల డిప్యూటీ ఈఓ జి. గంగాధర్, ఎంఈఓలు ఎం.వి. సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్స్ స్కూళ్లుగా పాఠశాలలు
కారంచేడు: రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు తగిన పాఠశాలల ఎంపికను పటిష్టంగా జరపాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) బి. లింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. బుధవారం ఆయన కారంచేడు గ్రామంలోని వైఎన్‌ఓ ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు వచ్చిన అనంతరం ఎమ్మార్సీలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. గుంటూరు ఆర్‌జేడీ కార్యాలయ పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేయబోతున్న పాఠశాలలను పరిశీలించాలని సూచించారు. విద్యాశాఖ కమిషనర్ సూచనలు, సలహాలను ఆర్‌జేడీ నమోదు చేసుకున్నారు. ఆయన వెంట బాపట్ల డీఈఓ ఎస్ పురుషోత్తం ఉన్నారు.


