కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
వేటపాలెం: పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ప్రసాద్ పేటకు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ (37) ఇంట్లో ఉరేసుకొని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ రమేష్ ఆదివారం విధుల నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తండ్రి, అమ్మమ్మ ఇంటి బయట నిద్రించారు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి కుమారుడు బయటకు రాకపోవడంతో తండ్రి కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తీసి చూడగా ఇంట్లో ఉరేసుకొని కనిపించాడు. రమేష్ వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ గొడవల కారణంగా ఐదేళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. పిల్లలను కూడా ఆమే చదివిస్తోంది. ఈ కేసు చీరాల కోర్టులో పెండింగ్‌లో ఉంది. చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు, వెదుళ్లపల్లి ఎస్సై భాగ్యరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
నాటికలు పరిషత్‌లకే పరిమితం కాకూడదు
యడ్లపాడు: నాటికలు కేవలం పరిషత్ ప్రదర్శనలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజాచైతన్యానికి పాటు పడేలా చేయాలని సినీనటుడు అజయ్‌ఘోష్ చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించిన 22వ జాతీయస్థాయి పోటీల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై మరిన్ని నాటికలు రచించి, గ్రామాల్లో ప్రదర్శించాలని కోరారు. ఇక్కడి నాటికల పోటీల నిర్వహణ, నిబద్ధత, వాటి ఆదరణ తీరు తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ విషయంలో డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు అభినందనీయుడన్నారు. ఏటా పోటీల సమయంలో యడ్లపాడు వస్తానని, తనకు ఓ నాటిక వేసే అవకాశం ఇవ్వాలని కమిటీని కోరారు. దేశాన్ని కాపాడేందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఒకరితో అంటే నీకు అడిగే అర్హత ఉందా అంటూ తనను ప్రశ్నించారని, ఓ అభిమానిగా ఽధైర్యంగా ప్రశ్నించే హక్కు ఆ ఎర్రజెండానే ఇచ్చిందని వేదిక ద్వారా స్పష్టం చేశారు. నేటి యువత కమ్యూనిస్టు పోరాట యోధుడు సుందరయ్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రజల దుస్థితిపై నాటకాలు రావాలి..
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో పేదరికం, కనీస అవసరాలు, తాగునీరు అందని అవస్థలు, కిడ్నీలు అమ్ముకునే దుస్థితిపై స్పందించి రచయితలు నాటకాలు రాయాలని కోరారు. తెలుగురాష్ట్రాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యధిక నాటక పరిషత్‌లు వెలుగొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ట నాటక రంగాన్ని దాతలు, పరిషత్ నిర్వాహకులు, ముఖ్యంగా ప్రజలు బతికిస్తున్నారన్నారు.


