అకాల వర్షం.. ఆశలు ఆవిరి
● తడిచి పాడైన పచ్చి ఇటుక ● వర్షం బారిన మొక్కజొన్న పంట
కొల్లూరు మండలం గాజుల్లంక చినరేవు వద్ద వర్షపు నీటిలో నానుతున్న పచ్చి ఇటుక
కొల్లూరు: అకాల వర్షం ఇటు రైతులను.. అటు ఇటుక ఉత్పత్తిదారులను నష్టాల పాల్జేసింది. శనివారం మధ్నాహ్నం అకస్మాత్తుగా వర్షం కురిసింది. మండలంలో వందలాది ఎకరాలలో మొక్కజొన్న పంట వర్షానికి తడిచింది. ఇటుక రాయి పరిశ్రమపైనా వర్షం ప్రభావం తీవ్రంగా పడింది. రైతులు కల్లాల్లో ఆరపెట్టిన మొక్కజొన్న గింజలతోపాటు, మొక్కజొన్న కండెలను ఆరపెట్టుకునే వెసులుబాటు లేకపోవడంతో తడిచి పోయాయని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇటుక పరిశ్రమ ముగింపు దశలో ఉన్న తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మండలంలో సుమారు రెండు కోట్ల వరకు పచ్చి ఇటుక వర్షానికి తడిచి ఎందుకూ పనికిరాకుండా పోయింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షం కారణంగా తడిచిన మొక్కజొన్న పంట రంగుమారి ధర తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక మొక్కజొన్నకు ఆశించిన ధర లభించని తరుణంలో వర్షం రూపంలో వచ్చిన విపత్తుతో మరింత ధర తగ్గిపోయి పెట్టుబడులు లభించవన్న భావన రైతుల్లో వెల్లడవుతుంది. ప్రస్తుతం పరిశ్రమ చివరి దశలో ఉండటంతో తడిసిన ఇటుకలను తొలగించి తిరిగి బట్టీలకు అవసరమైన పచ్చి ఇటుక తయారు చేయాలంటే శ్రమతోపాటు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా పరిశ్రమ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇటుక అమ్మకాలు మందగించి పరిశ్రమ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో వర్షం కారణంగా ఏర్పడిన నష్టంతో ఇటుక ఉత్పత్తిదారులు కోలుకునే అవకాశం లేదన్న ఆవేదన పరిశ్రమదారుల్లో వ్యక్తమవుతుంది. వర్షం కారణంగా కొల్లూరులో పలు రహదారులు జలమయమవడంతోపాటు, డ్రెయిన్‌ల్లో మురుగు పొంగి రోడ్లపైకి చేరడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అకాల వర్షం.. ఆశలు ఆవిరి
అకాల వర్షం.. ఆశలు ఆవిరి


