విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా
అభ్యంతరాల స్వీకరణ 11 వరకు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్.కామ్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు వెబ్‌సైట్లో ఉంచి సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈనెల 11వ తేదీలోపు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
సౌపాడులో వీధి కుక్కల దాడి
ఏడుగురికి తీవ్ర గాయాలు
గుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో వీధిక్కులు దాడిచేసి ఏడుగురిని గురువారం తీవ్రంగా గాయపరిచాయి.తీవ్రంగా గాయపడిన వారిని 108లో గుంటూరుకు జీజీహెచ్‌కు తరలించారు. ఇటీవల గ్రామాల్లో శునకాల బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత శనివారం వట్టిచెరుకూరు గ్రామంలో రైతు మక్కెన సుబ్బారావుకు చెందిన బర్రెదూడపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇప్పటికీ దూడ పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా గురువారం జరిగిన దాడిలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికై నా అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు
13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ
నరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు.
ధాన్యం సేకరణ లక్ష్యం 10వేల మెట్రిక్ టన్నులు
నరసరావుపేట: రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. కనీస మద్దతు ధరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని, కొనుగోలుకేంద్రాల ద్వారా తాము పండించిన పంటను విక్రయించాలని సూచించారు.
విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా


