కరువు ముంగిట అల్లాడుతున్నాం! | - | Sakshi
Sakshi News home page

కరువు ముంగిట అల్లాడుతున్నాం!

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో రైతుల ఆవేదన

‘వెలిగల్లు’ నుంచి నీటి విడుదలకు విన్నపం

పులివెందుల/చక్రాయపేట : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయా రు. ఈ మేరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న తన నివాసంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డి, ఎంపీపీ మాధవి బాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్య దర్శులు ఈశ్వరరెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రామాంజనేయరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ రామాంజుల రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గఫూర్‌, వైఎస్సార్‌సీపీ నేతలు గంగయ్య, దేవానందరెడ్డి, అంజలి రెడ్డి, రాజబాబు, పలువురు రైతులు కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న కరువు వర్షాభావ పరిస్థితులను అన్నదాతలు ఎంపీకి వివరించారు. వర్షాల్లేక పాపఘ్ని నదిలో భూగర్భజలాలు అడుగుంటిపోయాయని, బోర్ల ఫిల్టర్లు ఎండిపోయాయన్నారు. అలాగే తాగు నీటి ఎద్దడి కూడా గ్రామాల్లో నెలకొందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 0.02 టీఎంసీల నీటిని పాపాఘ్ని నదికి వదిలితే భూగర్భజలాలు వృద్ధి చెంది బోర్లు రీచార్జ్‌ అవుతాయని వివరించారు. అలాగే కుప్పానికి నీరు తీసుకెళ్లడానికి రైతుల అనుమతి లేకుండా పొలాల్లో పైపులైన్‌ పనులు చేస్తున్న విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. అలాగే గండి ఆలయ మాజీ చైర్మన్‌ కావలి కృష్ణతేజ గండి సమస్యలతో పాటు వీరన్నగట్టుపల్లె సమస్యలను ఆయనకు వివరించారు.

నీటి విడుదలకు ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌

ఇంజనీర్‌కు లేఖ రాసిన ఎంపీ

చక్రాయపేట, వేంపల్లె మండలాల్లో తాగునీటి కొరతను తీర్చడానికి వెలిగల్లు జలాశయం నుంచి పాపాఘ్ని నదిలోకి 0.20టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బాల చంద్రారెడ్డికి లేఖ రాశారు. పాపాఘ్ని నదీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, వర్షపాతం కొరత కారణంగా భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గిపోయిందని అందులో పేర్కొన్నారు. ఎంపీ లేఖకు స్పందించిన ఇరిగేషన్‌ శాఖ సీఈ ఫోన్‌ ద్వారా ఎంపీతో మాట్లాడారు. ఈ విషయంపై నిర్ణయాధికారం కలెక్టర్‌ తీసుకుంటారని వివరించారు. దీంతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తాగునీటి సమస్యపై కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement