నీళ్ల కోసం ఉద్యమ శంఖారావం | - | Sakshi
Sakshi News home page

నీళ్ల కోసం ఉద్యమ శంఖారావం

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

హంద్రీనీవా జలాల కోసం

ఉద్యమకార్యాచరణ

రాజకీయాలకతీతంగా పోరాటం

చెక్‌పోస్టు కూడలిలో నిరసన

రామసముద్రం : హంద్రీనీవా సుజల స్రవంతి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ జలాల సాధన కోసం ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టారు. ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ నినదించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఒకే డిమాండ్‌తో గళమెత్తడం ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. తాగునీరు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రామసముద్రం మండలానికి హంద్రీనీవా జలాలను తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటితో చెరువులు, కుంటలు నింపి సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు భూగర్భ జలాలను పెంచే అవకాశం ఉందన్నారు. మండలంలోని 19 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయికి ఉద్యమం

ఒక్క నిరసనతో వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేయాలని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సాధన సమితి నిర్ణయించింది. రోజుకో కార్యక్రమంతో గ్రామగ్రామాన ఉద్యమాన్ని విస్తరించి, ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చింది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన తరహాలో రామసముద్రం నీటి సమస్యను రాష్ట్ర స్థాయిలో చర్చకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. నీటి హక్కు సాధించే వరకు వెనక్కి తగ్గంకుండా హంద్రీనీవా జలాల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సాధన సమితి సభ్యులు స్పష్టం చేశారు.

మాటలు కాదు.. నీళ్లు కావాలి

వరుస కరువులతో రైతులు సాగుకు దూరమవుతున్నా.. భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నా.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక హామీలు, ప్రకటనలతో కాలయాపన కాకుండా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని సాధన సమితి డిమాండ్‌ చేస్తోంది. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి లింక్‌ కాలువ ఏర్పాటు చేసి అగ్రహారం, రామసముద్రం పెద్ద చెరువులతో పాటు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను అనుసంధానించి నీటితో నింపేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు. చెరువులు నిండితే భూగర్భజలాలు పెరిగి తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

చెరువులు నిండే వరకు పోరాటం

తాగునీరు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కమిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. రామసముద్రం మండలంలోని ప్రతి చెరువు నిండేలా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ జలాలను అందించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు.

అధికారులకు వినతిపత్రాలు

నిరసన అనంతరం సాధన సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ అజారుద్దీన్‌, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. రామసముద్రం మండలానికి హంద్రీనీవా జలాలను అందించే మార్గాలను పరిశీలించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement