– కలెక్టర్ నిశాంత్‌కుమార్
సాక్షి, మదనపల్లె: స్వచ్ఛతే సేవ, పరిశుభ్రమైన జిల్లా లక్ష్యంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, డీపీఓతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. నాలుగు మున్సిపాలిటీలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేలా కృషి చేయాలన్నారు. స్వచ్ఛ పాఠశాల, సఫాయి మిత్ర సురక్ష, స్వచ్ఛత కోసం ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛతా సే సమృద్ధి అంశాలపై దిశానిర్దేశం చేశారు. గురువారం ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దీపం వెలిగించి స్వచ్ఛత కోసం సంకల్పం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మదనపల్లె, బి కొత్తకోట, పుంగనూరు మున్సిపల్ కమిషనర్లు కే.ప్రమీల, బిక.రమాదేవి మధుసూదన్ రెడ్డి, డిపిఓ రాధమ్మ పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జన
ఏర్పాట్ల పరిశీలన
పీలేరురూరల్ : పీలేరు పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్సీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు. స్థానిక అయ్యపునాయుని చెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ వెంకటేశ్వర్లను ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీ, భక్తులు సహకరించాలని కోరారు.
సీఆర్‌పీఎఫ్ కేంద్రం సందర్శన
కలికిరి: కలికిరి సమీపంలోని సీఆర్‌పీఎఫ్ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ ఐజీ దినేష్ ప్రతాన్ ఉపాద్యాయ్‌తో కలిసి కేంద్రం ఆవరణలోని నూతన భవనాలు, మెస్, బ్యారక్‌లను పరిశీలించారు. సీఆర్‌పీఎఫ్ బలగాలకు స్థానిక పోలీసు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ పోటీలు
మదనపల్లె సిటీ: జిల్లాలోని అన్ని పీఎం శ్రీ పాఠశాలల్లో ఈనెల 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ పోటీలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ తెలిపారు. ఈపోటీలు వచ్చే నెల 17 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ‘పిల్లల కలల భారతదేశం’ అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు జరుగుతాయన్నారు. పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల ఎంట్రీలతో జిల్లా స్థాయిలో, ఆపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయన్నారు. విజేతలకు బహుమతులు ఉంటాయని తెలిపారు.


