గుర్రంకొండ : ఖరీఫ్ పంటలసాగుకు సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో వివిధ రకాల పంటల సాగు చేసే రైతుల కోసం ముందుగా పచ్చిరొట్ట సాగు చేసుకొంటే పొలాలు సారవంతమవుతాయి. తద్వారా భూమిలో భూసారం పెరిగి అధిక పంట దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు రైతులు వరి, టమాటా, ఇతర కూరగాయాల పంటల సాగులో సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. జూన్‌నెలలో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట సాగుకు ఇదే అదను అని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ రకం ఎరువు వినియోగం వల్ల భూమి గుళ్లబారుతుంది. పొలానికి నీటిని, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరగడంతో మొక్కల వేర్లకు గాలి, నీరు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము జీలుగలు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను ఎరువుగా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. పంటలో కలుపుమొక్కలను కూడా నివారించవచ్చు. వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలో ఇంకేలా చేస్తుంది. పప్పుజాతి పచ్చిరొట్టపైరు వల్ల భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంపొందించవచ్చు.
పచ్చిరొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా కాండం వచ్చి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వల్ల పైర్లపై నత్రజని బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగిఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండడంతో పాటు నీటి ఎద్దడి తట్టుకొని పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్ల వేర్లు భుమిలోకి త్వరగా చొచ్చుకొని పోయే గుణం కలిగి ఉంటుంది.
సేంద్రీయ కర్బనం పెంచుకోవడానికి..
సేంద్రియ కర్బనం లేకపోవడంతో వరిపంటకు శాపంగా మారుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వస్తున్న మార్పులు పంట అవశేషాల్ని తొలగించడం లేదా కాల్చేయడం, భూమికోతకు గురికావడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం.. ఇవన్నీ సేంద్రీయ కర్బన లోపానికి కారణాలే. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు సాగుచేసుకోవడమే ఉత్తమమైన మార్గమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సేంద్రియ కర్బనం పెంచడానికి జీలుగ, జనుము, పిల్లపెసర అద్భుతమైన పచ్చిరొట్ట ఎరువు. ఇది భూమి సారాన్ని, సారవంతతను మెరుగుపరిచి పంట దిగుబడులు పెరిగేలా చేస్తుంది.
భూసారంపెరుగుతుంది
పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల గుణం భూమిలో ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎన్నో రకాల జబ్బులకు కారణమైన రసాయనికి ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్వచ్ఛమైన, ఆరోగ్యానికి మేలు చేసే పంటదిగుబడులు సాధించవచ్చు.
– రత్నమ్మ, ఎవో, గుర్రంకొండ
భూసారం పెరుగుదలకు దోహదం


