చినుకు లేదు.. చింత తప్ప | - | Sakshi
Sakshi News home page

చినుకు లేదు.. చింత తప్ప

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

మూపురాలు ఆడిస్తూ పొలమంతా అడుగులేయాల్సిన కాడెద్దులు మూలనున్న కాడిని చూస్తూ మౌనంగా నెమరేస్తుంటే..

పండగలా సాగు చేద్దామనుకున్న కర్షకలోకం.. రాలే చినుకు కోసం కళ్లు ‘కాయలు’కాసేలా ఎదురుచూస్తుంటే.. పుడమితల్లి ‘బీడు’ పడి దిక్కులు చూస్తోంది. పచ్చని చీర చుట్టి మురిసిపోవాలనుకున్న తన ఆశ ఆవిరయ్యేలా ఉందని దిగాలు పడుతోంది.

అటు.. మేఘం వర్షించక.. ఇటు విత్తనం రాక.. ఖరీఫ్‌ సీజన్‌ బోసిపోయింది.

సాక్షి, మదనపల్లె : ఖరీఫ్‌ సీజన్‌ వస్తే రైతన్నలకు క్షణం తీరిక ఉండదు. పొలాల దుక్కుల్లో మునిగిపోతారు.. ఎరువులు కొనుగోలు చేయడంలో.. మేలైన విత్తనాల సేకరణలో బిజీ అయిపోతారు.. తొలకరి వర్షాలు మొదలవగానే కాడెద్దులకు పూజ చేసి.. పొలంలో పంటవిత్తడం మొదలు పెడతారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏ పల్లెలో చూసిన ఈ పరిస్థితుల్లో కానరావడం లేదు. వర్షించని ఆకాశం, దుక్కులకు నోచుకోని పొలాలు, ఇళ్లల్లో కనిపించని విత్తనం.. ఫలితంగా ఖరీఫ్‌ సాగుకు అడుగేపడలేదు. సాధారణంగా ఏప్రిల్‌ చివరి వారం నుంచి రైతులు ఖరీఫ్‌ సాగు మొదలుపెట్టి జూన్‌ రెండో వారానికి 70 శాతానికి పైగా సాగు పూర్తి చేస్తారు. ఈసారి కనుచూపుమేరలో సాగు కనిపించడం లేదు. ఖరీఫ్‌ ముగిసేందుకు మిగిలింది మూడు వారాలే అయినా ప్రభుత్వం నుంచి రైతులకు విత్తనం అందడం లేదు, వరుణుడు చినుకు వదలడం లేదు. ఫలితంగా ఖరీఫ్‌ నిరాశగా ముగిసేలా కనిపిస్తోంది.

పంపిణీ ప్రశ్నార్థకమే!

ఈ ఖరీఫ్‌ లో జిల్లాకు 43 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. జిల్లాలోని 25 మండలాలకు ఈ విత్తనాన్ని అధికారులు కేటాయింపులు చేశారు. జూన్‌ మొదటి వారానికి విత్తన కాయల పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా సాగుపై.. జిల్లా రైతాంగంపై తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా జిల్లాకు సరఫరా చేసిన విత్తన కాయలు కేవలం 16 వేల క్వింటాళ్లకు లోపే. అధికారిక లెక్క ప్రకారం ఇంకా 20 వేల క్వింటాళ్లకు పైగా విత్తన కాయలు జిల్లాకు సరఫరా కావాల్సి ఉంది. వీటి సరఫరా ఎప్పుడు జరుగుతుంది, మండలాలకు తరలించే రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌ ము గింపు దశకు చేరుకున్నందున విత్తన కాయలు సరఫరా చేసినా ప్రయోజనం ఉంటుందా అన్నది అనుమానం. ఈపాటికే ప్రభుత్వం విత్తన కాయలను సరఫరా చేసి ఉంటే ఇకపై కురిసే వర్షాలను నమ్ముకుని పంట సాగు చేసే అవకాశం అంతో ఇంతో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందో లేదో చెప్పలేమని కర్షకులు వాపోతున్నారు. సాగులో ప్రభుత్వానిది ఒక వైఫల్యమని మండిపడుతున్నారు.

విత్తు పడలేదు

జిల్లాలోని 25 మండలాలకు కలిపి సాగు కావలసిన భూ విస్తీర్ణంలో ఇప్పటివరకు ఒక శాతం కూడా సాగు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 46,055 హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ అంచనా గత ఖరీఫ్‌ కంటే చాలా తక్కువ. అయినప్పటికీ ఖరీఫ్‌ సాగు దయనీయంగా ఉంది. ఇప్పటిదాకా కేవలం 437 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ అధికంగా 27,015 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 352 హెక్టార్లలో మాత్రమే సాగైంది అంటే ఖరీఫ్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక మిగిలిన మూడు వారాల్లో 99 శాతం విస్తీర్ణం సాగు సాధ్యపడుతుందా? అంటే సందేహమే.

43 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయిస్తే.. పంపిణీ చేసింది 16 వేల క్వింటాళ్లే

46,055 హెక్టార్లకు సాగైంది 437 హెక్టార్లలోనే

ఖరీఫ్‌ ముగుస్తున్నాజిల్లాలో ఒక శాతం కూడా సాగు లేదు

జిల్లాలో వర్షపాతం దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మే నెలలో సగటు వర్షపాతంగా నమోదైనప్పటికీ ఆ ప్రభావం సాగుపై ఎక్కడా కనిపించలేదు. దీన్నిబట్టి చూస్తే కొన్నిచోట్ల కురిసిన వర్షం జిల్లా అంతటా సగటుగా లెక్కించారని తెలుస్తోంది. జూన్‌ నెల విషయానికి వస్తే సగటు 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఆదివారం నాటికి 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ మాత్రం వర్షపాతం కురిస్తే పంటల సాగు అంతో ఎంతో ముందుకు సాగుతాయి. అయినప్పటికీ విత్తు మాటే లేకుండా పోయింది. జూన్‌లో ఇప్పటిదాకా కురిసిన 47.8 మిల్లీమీటర్ల వర్షం వ్యవసాయానికి సరిపోదు. ఈ ప్రభావం కూడా సాగుపై తీవ్రంగా చూపిస్తోంది. జూలై 15 లోపు వర్షాలు కురిస్తే రైతులు పంటలు సాగు చేయడానికి అనువు. ప్రధానంగా వేరుశనగ పంట. ఈలోపు వర్షాలు కురువకపోతే ఇక ఖరీఫ్‌ ఫై ఆశలు వదిలేసినట్టే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement