పై ఫొటోలో కనిపిస్తున్న పచ్చటి కాయలను చూసి ఏ సాదాసీదా మామిడి కాయలో అనుకుంటే ఊరగాయలో కాలేసినట్లే! ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోన అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన వంద శాతం సేంద్రీయ అడవి మామిడి పంట! తలకోన జలపాతం పరిసరాల్లో ఏపుగా పెరిగిన ఈ చెట్ల కాయలు ఇప్పుడు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి మామిడి చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో పెరగడంతో మనుషులు ఎక్కి కాయలు కోయడం అసాధ్యం. మరి ఈ కాయలు మార్కెట్‌లోకి ఎలా వస్తున్నాయో తెలుసా? ఇక్కడి కొండముచ్చులు, కోతుల సైన్యమే ఆ పనిని ఉచితంగా చేసిపెడుతున్నాయి. కోతులు చెట్ల కొమ్మలపై చిందులు వేస్తూ కాయలను కిందకు రాల్చితే.. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానికులు, కూలీలు వాటిని జాగ్రత్తగా ఏరుకుని ఇలా బకెట్లలో నింపి పర్యాటకులకు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. తోటల్లో లాగా ఈ చెట్లకు ఎలాంటి రసాయన ఎరువులు లేదా పురుగుమందులు పిచికారీ చేయరు. ఈ కాయలు సహజసిద్ధమైన పులుపును కలిగి ఉండటంతో నిల్వ ఊరగాయలు పెట్టుకోవడానికి ఇల్లాళ్లు ఎగబడుతున్నారు. ఇక్కడ కిలోల లెక్క ఉండదు. ఒక్కో కాయను రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. ఒకవేళ బస్తాల రూపంలో కావాలంటే 20 కిలోల బస్తా రూ.5,000 వరకు పలుకుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. బయట మార్కెట్‌లో మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతుంటే, తలకోనలో మాత్రం ఈ అడవి మామిడికి గిరాకీ ఓ రేంజ్‌లో ఉండటం విశేషం.
– రొంపిచెర్ల


