– హత్య చేశారని పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన..
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కావాలనే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తాలూకా పోలీసులు మతుని కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని నారమాకుల తాండాకు చెందిన చిన్న బుడ్డానాయక్ (38) వ్యవసాయం చేస్తాడు. ఇతనికి ఆశ కార్యకర్తగా పనిచేసే భార్య ప్రమీల, కుమారులు ప్రభానాయక్, డేవిడ్ నాయక్, పవన్నాయక్ లు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్నబుడ్డానాయక్ ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలోని రామాపురం, దండువారిపల్లె వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు అనుమానిస్తుండగా, రోడ్డు ప్రమాదం కాదని, కావాలనే ఎవరో కొట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తూ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా సష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి వెళ్లిన బంధువులు మృతుడి భార్యపై, గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిపైకి గొడవకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ చంద్రమోహన్ గ్రామానికి చేరుకుని అనుమానాలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు, విచారణలో కొత్త అంశాలు తెలిస్తే సెక్షన్లు మారుస్తామని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు శాంతించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ములకలచెరువు మండలంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలానికి చెందిన 17 ఏళ్ల యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గురువారం విడుదలైన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో కామర్స్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై గన్నేరు పప్పు తినింది. కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


