వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:00 గంటలకు క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ తెలిపారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు, తల్లితండ్రులకు భోజన వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు.
రెండు రోజుల్లో 1,010 మందికి కౌన్సెలింగ్ :
ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం 19వ తేదీ శుక్రవారం 500 మంది అభ్యర్థులకు, 20వ తేదీ శనివారం 510 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైళ్లకు సందేశాలు పంపించారు. అలాగే ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి సంబంధించి ఈనెల 22, 23 తేదీలలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లోనే అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.


