సెన్సేషనల్‌.. సన్‌షైనింగ్‌ ! | - | Sakshi
Sakshi News home page

సెన్సేషనల్‌.. సన్‌షైనింగ్‌ !

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

చంద్రుడిలోని కాంతినంతా

దోసిళ్లతో కుమ్మరించినట్లు ..

కాంతి పుంజమేదో నేలపై వాలినట్లు..

ప్లడ్‌ లైట్లు వెలుగులు పంచగా..

ఆట మెరిసింది.. పాట విరిసింది..

తొలిసారి ‘ఏపీఎల్‌ పండగ’ కడపకు రాగా..

అభిమానుల గుండె గడప ఉత్సాహంతో

నిండిపోయింది...

పిల్లా జల్లా తరలిరాగా వైఎస్‌ రాజారెడ్డి స్టేడియం జనసంద్రమైంది..

మైదానంలో బ్యాటర్లు విజృంభించడంతో ‘బౌండరీ’ చిన్నబోయింది..

అప్పుడప్పుడూ బంతి చుక్కల్ని ముద్దాడుతూ సిక్సుగా మారింది..

గ్యాలరీలో క్రీడాభిమానుల కేరింతలకు మైదానం మురిసిపోయింది..

బుధవారం విజయవాడ సన్‌షైనర్స్‌,

తుంగభద్ర వారియర్స్‌ జరిగిన మ్యాచ్‌

ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

క్రికెట్‌ జిల్లా వాసులకు

కనువిందు చేసింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

అశ్విన్‌ హెబ్బర్‌

సాక్షి ప్రతినిధి, కడప : కడపలో బుధవారం జరిగిన మ్యా చ్‌లో విజయవాడ సన్‌ షైనర్స్‌ జట్టు, తుంగభద్ర వారియర్స్‌ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రసవత్తర పోరులో 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌పై విజయవాడ సన్‌ షైనర్స్‌ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.

టాస్‌ గెలిచిన విజయవాడ..

ముందుగా మ్యాచ్‌ ప్రారంభానికి గాను బీసీసీఐ మెంబర్‌ చాముండేశ్వరి నాథ్‌ టాస్‌ వేసి ఈ సీజన్‌ను అధికారికంగా ప్రారంభించారు. టాస్‌ గెలిచిన విజయవాడ సన్‌షైనర్స్‌ జట్టు కెప్టెన్‌ అశ్విన్‌ హెబ్బార్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విజయవాడ ఓపెనర్‌ అశ్విన్‌ హెబ్బార్‌ మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ వీరవిహారం చేశాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 85 పరుగులు సాధించి జట్టుకు భారీ పునాది వేశాడు. అతనికి తోడుగా లోకల్‌ బాయ్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ జహీర్‌ అబ్బాస్‌ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీతో విజృంభించాడు. దీంతో విజయవాడ సన్‌షైనర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్‌ 2 వికెట్లు, హిమ శ్రీనివాస్‌ 2 వికెట్లు తీశారు.

పోరాడి ఓడిన తుంగభద్ర వారియర్స్‌..

అనంతరం 199 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన తుంగభద్ర వారియర్స్‌ జట్టును విజయవాడ బౌలర్‌ భరత్‌ తన పదునైన బౌలింగ్‌తో వణికించాడు. అయితే, తుంగభద్ర ఓపెనర్‌ సమన్యు 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి గట్టిగా రాణించాడు. అతనికి తోడుగా సత్యనారాయణ 21 బంతుల్లో 4 ఫోర్లతో రాణించగా.. మ్యాచ్‌ ఆఖరిలో సౌరవ్‌కుమార్‌ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో (24 పరుగులు) ధాటిగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. విజయవాడ సన్‌షైనర్స్‌ బౌలర్‌ భరత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టగా, సుమిత్‌ 2 వికెట్లు తీశారు. దీంతో తుంగభద్ర వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దంచికొట్టిన ఇన్నింగ్స్‌ ఆడిన విజయవాడ సన్‌షైనర్స్‌ బ్యాటర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement