బతుకు చింత...విలువ ఎంత? | - | Sakshi
Sakshi News home page

బతుకు చింత...విలువ ఎంత?

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

ధరల్లేక పుంగనూరులో

వందేళ్ల కుటీర పరిశ్రమ కుదేలు

15 వేల కుటుంబాల కన్నీరు

సగానికి పడిపోయిన

కోల్డ్‌ స్టోరేజ్‌ నిల్వలు

రంగు మారుతున్న సరుకుతో వ్యాపారుల విలవిల

నాడు జీఎస్టీ రద్దుతో

అండగా నిలిచిన ‘పెద్దిరెడ్డి’

నేడు కూటమి పాలనలో

కుప్పకూలిన మార్కెట్‌!

పుంగనూరు: సుమారు శతాబ్ద కాలంగా నాణ్యమైన చింతపండు ఉత్పత్తికి పుంగనూరు దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ‘నల్ల బంగారానికి’ అంతర్జాతీయంగానూ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. అయితే, వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ రంగం ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం, నిలకడలేని ధరల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నమ్ముకున్న 300 మందికి పైగా వ్యాపారులు నష్టాల ఊబిలో మునగగా, దీనిపైనే ఆధారపడిన 15వేల కూలీల కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయి.

దేశవ్యాప్త దిగుమతులు.. ఇళ్లే ఫ్యాక్టరీలు!

పుంగనూరులో ఈ రంగం ఒక పెద్ద కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. కర్ణాటక (గుండల్‌పేట, మాండ్యా, చింతామణి, శ్రీనివాసపురం, సిరా), మహారాష్ట్ర (ఔరంగాబాద్‌), తెలంగాణ (నిజామాబాద్‌), బీహార్‌ (రాంచి), ఛత్తీస్‌గఢ్‌ (జగదల్‌పూర్‌, రాయపూర్‌) ప్రాంతాల నుంచి ఏటా సుమారు 50,000 టన్నుల చింతకాయలను (కట్టికాయ) ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. 300 మందికి పైగా వ్యాపారులు ఈ కాయలను నేరుగా కూలీల ఇళ్లకే పంపిస్తారు. పుంగనూరు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల్లో దాదాపు 15,000 కుటుంబాలు ఈ చింతకాయను శ్రీపూపండుశ్రీగా మార్చే పనిపైనే జీవిస్తున్నాయి.

‘చపాతీ’ల తయారీ

20 కేజీల కాయను కొట్టి పూపండుగా మార్చి, 25 చపాతీలు (ముద్దలు) తయారు చేస్తారు. ఒక్కో కుటుంబం రోజుకు 100 నుండి 150 చపాతీలు చేస్తుంది. ఒక్కో చపాతీకి రూ.12 కూలీ లభిస్తుంది.

‘బిస్కెట్‌’: 20 కేజీల పూపండును 75 అరకిలో బిస్కెట్‌ తరహా ప్లాస్టిక్‌ ప్యాకెట్లుగా ప్యాక్‌ చేస్తారు. ఒక ప్యాకెట్‌కు రూ. 8 చొప్పున కూలీ ఇస్తారు. రోజుకు ఒక్కొక్కరు 80 ప్యాకెట్ల వరకు ప్యాక్‌ చేస్తారు. ఇలా ఇళ్లలోనే తయారైన నాణ్యమైన చింతపండు మద్రాసు, చైన్నె, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్‌, మంగళూరు వంటి మహానగరాలకు ఎగుమతి అవుతుంది.

కోల్డ్‌ స్టోరేజీల లెక్కలు.. మగ్గిపోతున్న సరుకు!

పుంగనూరు పట్టణంలో ఉన్న 8 కోల్డ్‌ స్టోరేజీలే ఈ వ్యాపారానికి ప్రాణాధారం. అయితే ప్రస్తుత సంక్షోభం ఇక్కడి నిల్వలపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రతియేటా ఈ గోడౌన్లలో సుమారు 3,000 లారీల చింతకాయను నిల్వ చేస్తారు. కానీ ఈసారి ధరలు నిలకడగా లేకపోవడం, వ్యాపారాలు మందకొడిగా సాగడంతో ప్రస్తుతం కేవలం 1,500 లారీల సరుకు మాత్రమే నిల్వ ఉంది. లకడ లేని ధరల కారణంగా గత రెండేళ్లుగా కోల్డ్‌స్టోరేజ్‌ల్లోనే చింతకాయ మగ్గిపోతోంది. సరుకు ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో అది నల్లగా మారి రంగు కోల్పోతోంది. దీనివల్ల మార్కెట్‌లో క్వాలిటీ పడిపోయి, వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. జూన్‌, జూలై నెలల్లోనైనా ధరలు కలిసివస్తాయని వ్యాపార వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ హయాంలో జీఎస్టీ రద్దు.. నేడు కూటమి నిర్లక్ష్యం!

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు చింతపండు వ్యాపారుల కష్టాలను గుర్తించి, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి వారు కేంద్ర ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చలు జరిపి, చింతపండుపై ఉన్న జీఎస్టీని పూర్తిగా తీసివేయించి చరిత్రాత్మక ఉపశమనాన్ని అందించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఈ వందేళ్ల పరిశ్రమ మళ్లీ మూలనపడింది. ధరల పతనంతో పరిశ్రమ కుదేలవుతున్నా, ప్రస్తుత పాలకులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానిక కార్మిక, వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దేశానికే రుచి చూపించే పుంగనూరు నల్ల బంగారం నేడు పాలకుల ఉదాసీనత వల్ల వెలవెలబోతోంది. 15 వేల కుటుంబాల కళ్లల్లో ఆనందం చూడాలంటే కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.

పుంగనూరు మార్కెట్‌ కమిటిలో కట్టికాయగా సిద్ధం చేసిన దృశ్యం, పుంగనూరు మార్కెట్‌ కమిటిలో లారీలలో దిగుమతి చేస్తున్న చింతకాయ

మార్కెట్‌లో ప్రస్తుత ధరల పట్టిక

కట్టికాయ (లారీ సరుకు) : రూ. 4.50లక్షలు

కట్టికాయ (కిలో) : రూ.45

పూపండు (కిలో) : రూ.70 నుంచి రూ.100

చపాతీ పండు (కిలో) : రూ.110 నుంచి 120

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement