కేవీపల్లె : పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ కుంటిమేకలవారిపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి కుంటిమేకలవారిపల్లెకు చెందిన ఎం. వెంకటరమణ, సులోచన (45)కు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు లక్ష్మీనారాయణ తిరుమలలో ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ధనలక్ష్మీ తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం ఇంటి వద్ద మనస్పర్థలతో భార్యాభర్తలు గొడవ పడ్డారు. అనంతరం వెంకటరమణ గొర్రెలు మేపుకోవడానికి వెళ్లాడు. క్షణికావేశానికి లోనైన సులోచన పురుగుల మందు తాగింది. తిరిగి ఇంటికి వచ్చిన వెంకటరమణ భార్య పరిస్థితి చూసి చికిత్స నిమిత్తం గర్నిమిట్ట పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు.
భార్యపై కోపంతో ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : పెళ్లయి ఆరు నెలలు కూడా తిరగక ముందే ఓ యువకుడు తన భార్యపై కోపంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లి పంచాయతీ పంది వానిపెంటకు చెందిన ఓబులేసు కుమారుడు లోకేష్ (21) ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్యా భర్తలు గొడవపడి లోకేష్ బుధవారం మనస్తాపంతో విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహామేరకు కుటుంబీకులు లోకేష్‌ను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీఎండీఎస్ విధానం లాభదాయకం
రామాపురం : ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ విధానం రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం)వెంకటమోహన్, రీజియన్ కన్సల్టెంట్ చంద్రశేఖర్ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలు, పీఎండీఎస్ విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాలు ప్రారంభం కాకముందే పైలైటెజేషన్ చేసిన విత్తనాలను విత్తడం ద్వారా తొలి వర్షాలను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని,దీనివల్ల మొలకశాతం పెరిగి పంటల ఎదుగుదల మొరుగుపడుతుందని వివరించారు. అలాగే డీఆర్‌పీఎం నమూనా ద్వారా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఏ యశోద,ఎం.టి మధుకర్,ఎంటిఎల్ భూపాల్‌రెడ్డి రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
నగలు,నగదు అపహరణ
సంబేపల్లె : మండల పరిధిలోని గుట్టపల్లె గ్రామ కస్పాలో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి సమీంలో బుధవారం రాత్రి భారీ చోరి జరిగింది. వివరాలమేరకు అఖిల భారత పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రటరీ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఎం.చిదంబర్‌రెడ్డి నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలకొట్టి చొరబడ్డారు. బీరువాలు, లాకర్లు ధ్వసం చేసి 400 గ్రామల బంగారం, 12 కిలోలు వెండి, రూ. 2 లక్షల నగదు, 30 పట్టుచీరలు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా చిదంబర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. చిదంబర్‌రెడ్డి నివాసం పక్కనే ఉన్న ఆంజనేయులు ఇంటిలో కూడా దొంగలు పడి రెండు రింగ్‌లను దొంగలించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రోషన్, ఎస్‌ఐ రవికుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ చిదంబర్‌రెడ్డి ఇంటితో పాటు సమీప ప్రాంతాల్లో పరిశీలించారు.


