చేదు మిగిల్చిన తీపి ఫలం ! | - | Sakshi
Sakshi News home page

చేదు మిగిల్చిన తీపి ఫలం !

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

పెట్టుబడులు కూడా రాని పరిస్థితి..

మామిడికాయల రేటు లేక నష్టపోయాం

ఆరుగాలం శ్రమించినా... రైతన్న కష్టానికి ‘ఫలం’దక్కడం లేదు.. తీపిని పంచే మామిడి రైతు జీవితాల్లో చేదుగానే మారుతోంది. అటు ప్రకృతి సహకరించక.. ఇటు కూటమి కనికరించక ఏటా నష్టమే మిగులుతోంది. మామిడి రైతులకు ఈ సారీ నిరాశే మిగిలింది.

మామిడి రైతులకు

ఏటా పెరుగుతున్న కష్టాలు

దిగుబడి రాక....ధరలేక

తల్లడిల్లిపోయిన మామిడి రైతు

ప్రస్తుత సీజన్‌లోనూ గిట్టుబాటు ధర లేక పతనం

కూటమి సర్కార్‌లో రెండవ ఏడాది కొనసాగిన కష్టకాలం

సాక్షి అన్నమయ్య : కూటమి సర్కార్‌లో మామిడి రైతులకు కష్టకాలం వెంటాడుతోంది. గతేడాది ధరల్లేక పంటను కొనుగోలు చేసేవారు కానరాక రైతులు కాయలను జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద పారబోశారు. మరికొంతమంది రోడ్లపైనే పడేశారు. ఆ చేదు జ్ఞాపకాలను ఈ ఏడాది పంటైనా మరిపిస్తుందని.. తియ్యటి లాభాలు పంచుతుందని ఆశపడ్డ మామిడి రైతుకు నిరాశే ఎదురైంది. చేదు రెట్టింపైంది. దిగుబడులు లేక...ధరలు రాక... మామిడి పంట నిలువునా దెబ్బతీసింది. దీనికితోడు తెగుళ్లు.. వాతావరణ పరిస్థితులు ఈ సీజన్‌ను పూర్తిగా దెబ్బకొట్టాయి. మరోవైపు ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

అన్నమయ్య జిల్లాలో మామిడిని భారీగా సాగు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మామిడి రకాలు సాగులో ఉన్నాయి. జిల్లా నుంచి ఏటా 150–200 టన్నుల మేర సరుకు ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. అటువంటి పరిస్థితులు ఉన్న జిల్లాలో మామిడి రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. దిగుబడులు కేవలం 20–30 శాతానికి పడిపోగా.. ధర పాతాళానికి దిగజారింది. ఇక తోతాపురి రకం మామిడి అట్టడుగుకు పడిపోయింది.

మామిడి రైతుకు ఏదీ చేయూత?

మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం. ఇటీవల వీచిన గాలివానకు అనేక చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. అంతకుముందు తొలిమంచు ప్రభావంతో పూత, పిందె సరిగా రాకపోగా, తర్వాత వచ్చినా కూడా చీడపీడలు పంటను దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గతేడాది ధరలు లేక రోడ్లపై మామిడి కాయలు పారపోస్తున్న సందర్భంలో సీజన్‌ చివరి దశలో ఏదో కొంతమేర కిలోకు రూ. 45 ఇచ్చారు. ఈసారి ఇంతవరకు చేయూత అందించే ఆలోచన కూడా సర్కార్‌ చేయకపోవడంపై మామిడి రైతులు మండిపడుతున్నారు.

వరుసగా రెండో ఏడాది నష్టమే!

సాధారణంగా మామిడి పంటకు సంబంధించి మార్చి నుంచి జూన్‌ వరకు సీజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే వరుసగా రెండో ఏడాది రైతు నష్టపోయాడు. కాగా గతేడాది చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పటికే చాలాచోట్ల రైతులు మామిడి పంటను కొట్టివేశారు. ఈసారి కూడా ధరలు లేక మామిడి రైతు ఆశలపై నీళ్లు చల్లడంలో మామిడి సాగుపై రైతుల్లో అనాసక్తి మొదలైంది.

నాకు 20 ఎకరాలు పైబడి మామిడి తోట ఉంది. ఈఏడాది ఎరువులు, పురుగుమందులకు ఖర్చుచేసిన మేర కూడా మామిడిలో ఆదాయం రాలేదు. అసలే దిగుబడి అంతంతంగా ఉంటే.. ధర కూడా తక్కువగా పలికింది. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

– సిద్దక నాగిరెడ్డి, సిద్ధకవాండ్లపల్లె కస్తూరిరాజుగారిపల్లె , లక్కిరెడ్డిపల్లి

ఈ ఏడాది మామిడికాయలకు రేట్లు రాక చాలా నష్టపోయాం. ఏడాది పొడవునా నీళ్లు పడుతూ, పలు రకాల యూరియాలు వాడుతూ, కూలీలను ఏర్పాటు చేసుకుని మామిడి తోటను కాపాడుకుంటూ వచ్చాం. తీరా చూస్తే మార్కెట్లో మామిడికాయలకు రేటు విపరీతంగా పడిపోయింది. ఎప్పుడూ ఇలాంటి నష్టాన్ని చవిచూడలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– జయశంకర్‌రెడ్డి, మామిడితోట రైతు, చిన్నమండెం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement