మదనపల్లె టౌన్: కర్ణాటకలోని చింతామణి వద్ద ఆగి ఉన్న లారీని మార్కాపురం బస్సు ఢీకొన్న ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి చింతామణి ఎస్‌ఐ శివరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపో ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి బైపాస్‌లోని మాడికేరి క్రాస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని కుటుంబీకులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
20 మందికి గాయాలు


