అదొక పెద్ది గ్రామం
● రెవెన్యూ రికార్డుల్లో
జాడేలేని చిట్టిబోయనపల్లె
● ఆన్‌లైన్‌లో కనబడని 1800
ఎకరాల చిట్టిబోయనపల్లె భూములు
● రైతు గుర్తింపు కార్డు కోసం
అన్నదాతల పడిగాపులు
గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం ‘పెద్ది’ సినిమాలోని కొండకింద ఊరును తలపిస్తోంది. ఈ ఊరు పరిధిలో సుమారు 328 మంది రైతులకు సంబంధించి 1800 వందల ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల వరకు అంటే.. కూటమి కొలువుదీరక ముందు వరకు రెవెన్యూ రికార్డుల్లో ఊరు భద్రంగా ఉంది. భూములకు, వన్‌బీలు, అడంగ్‌లు, మ్యూటేషన్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీరి బతుకు దుర్భరంగా మారింది. ఏకంగా ఊరంతా రెవెన్యూ రికార్డుల్లో మాయమైంది. ఆన్‌లైన్‌లో గ్రామానికి సంబంధించిన ఒక్క రైతు భూమి కనిపించడం లేదు. దీంతో రెండేళ్లుగా ఊరిలో ఒక్కరికి కూడా రెవెన్యూ సేవలు అందకపోగా రైతులకు వ్యవసాయ పథకాలు అందడం లేదు. తాజాగా ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లోనూ భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫలితంగా గ్రామానికి చెందిన రైతులు రైతు గుర్తింపు కార్డుల కోసం యుద్ధమే చేస్తున్నారు. కాళ్లకున్న చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
రెండేళ్లుగా రెవెన్యూ సేవలు బంద్
చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాలన్నా ఆన్‌లైన్‌లో అడంగల్, ఒన్‌బీలు రాకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకమీదట రైతులకు రైతు భరోసా పధకం వర్తించాలంటే తప్పనిరిగా రైతుగుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇప్పటికే మండల వ్యాప్తంగా 6125 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగపోవడం విచారకరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమను కరుణించాలని వేడుకుంటున్నారు.
చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతులకు రైతు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే విషయం జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండేళ్లుగా ఈ సమస్య ఉంది. రైతుసేవాకేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మేం జిరాక్స్‌కాపీలను తీసుకొని వెబ్‌సైట్‌లో సమస్య పరిష్కారం కాగానే సమాచారం అందిస్తామని చెప్పి పంపిస్తున్నాం. – రత్నమ్మ, ఏఓ, గుర్రంకొండ.
చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతుల పొలాలకు సంబంధించి మ్యూటేషన్లు కావడం లేదు. చాలా రోజులుగా ఈ భూములకు సంబందించి ఆన్‌లైన్‌లోనే సమస్య ఉంది. ఆన్‌లైన్‌లో ఈ భూములకు సంబందించిన వివరాలు ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌లో ఉంచింది. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తొందరలొనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. – ఫణికుమార్, తహసీల్దార్, గుర్రంకొండ.


