జమ్మలమడుగు: గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన గండికోట ఇపుడు గ్రాండ్ కాన్వాస్‌గా మారుతోంది. 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక గండికోట ప్రస్తుతం అంతర్జాతీయ పర్యాటక రంగంతో పాటు సినీ గ్లామర్‌తో సరికొత్త వైభవాన్ని సంతరించుకుంటోంది. ఒకప్పుడు కనీస వసతులు లేక వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు కేంద్ర ప్రభుత్వ భారీ నిధులు, సౌత్ ఇండియన్ అగ్ర దర్శకులు, హీరోల చిత్రాల షూటింగులతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సౌందర్యం, శతాబ్దాల నాటి చారిత్రక వైభవం, ప్రభుత్వ నిధుల మద్దతు తోడవడంతో గండికోట పర్యాటక రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, టాలీవుడ్–కోలీవుడ్‌లకు నయా అడ్రస్‌గా అవతరించింది.
రూ. 72 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు
గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభు త్వం రూ. 72 కోట్ల రూపాయల ‘సాస్కి’ నిధులను విడుదల చేసింది. ఈ భారీ నిధులతో కోట మౌలిక సదుపాయాలు, అంతర్గత రహదారులు, తాగునీరు, వ్యూ పాయింట్ల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘హరిత హోటల్’ నిర్మాణంతో మొదలైన ఈ పర్యాటక ప్రస్థానం, ప్రస్తుతం అంతర్జాతీయ లుక్‌ను సొంతం చేసుకుంటోంది.
వీరచరిత్రకు అద్దం పడుతున్న పీరియాడిక్ చిత్రాలు
బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి గడ్డ (కొవెలకుంట్ల, జమ్మలమడుగు) పరిసరాలలో సాగించిన వీరపోరాటాలు నేటికీ సినీ దర్శకులకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి : ‘సైరా నరసింహారెడ్డి’
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి గుర్రపు స్వారీ చేస్తూ సాగించే హై–వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను అధునాతన గ్రాఫిక్స్ హంగులతో ఇక్కడే అద్భుతంగా ఆవిష్కరించారు.
విజయ్ దేవరకొండ – ‘రణబాలి’
1850–1890ల నాటి బ్రిటిషు వ్యతిరేక పోరాట యోధుడి కథతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఇక్కడ ఐదు రోజుల పాటు సాగింది. రంగనాథస్వామి ఆలయం, జుమ్మా మసీదు, పెన్నా నది లోయలలో గుర్రపు స్వారీ, శత్రు సంహార ఘట్టాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్ : ‘హరిహర వీరమల్లు’
మొఘలాయిల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ భారీ చిత్రానికి సంబంధించిన రిస్కీ స్టంట్స్ , యాక్షన్ షాట్స్‌ను డూప్ సహాయంతో గండికోట కట్టడాల మధ్యే చిత్రీకరించారు.
సౌత్ ఇండియన్ స్టార్ల ‘ఫేవరెట్’ స్పాట్
గండికోటలోని అద్భుతమైన భౌగోళిక లోయలు, చారిత్రక కోట గోడలు విజువల్ వండర్‌గా నిలుస్తుండటంతో దర్శకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.
తమిళనాడు సూపర్ స్టార్, సీఎం విజయ్
ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘కత్తి’, ‘పులి’ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి.
కమల్ హాసన్: శంకర్ దర్శకత్వంలో వచ్చిన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు–2’కు సంబంధించి కీలక ఘట్టాలను ఇక్కడ ఒడిసిపట్టారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు: హై–టెక్నికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ చిత్రానికి గండికోట వేదికై ంది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్: ప్రభాస్ నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ లోని కొన్ని అందమైన విజువల్స్ ఇక్కడే షూట్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి: ట్రెండ్ సెట్టర్ మూవీ ‘మర్యాద రామన్న’ (సునీల్ హీరో) చిత్రంలోని మెజారిటీ భాగం ఇక్కడే చిత్రీకరించారు.
గోపీచంద్ నటించిన అడ్వెంచరస్ చిత్రం ‘సాహసం’ లోని లోయల యాక్షన్ సీన్స్ గండికోట బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతాయి.


