సాక్షి, మదనపల్లె: ములకలచెరువు వ్యవసాయ మార్కెట్లో 15 కిలోల క్రేట్ల విధానం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. దీని అమలుకు సంబంధించి సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే రైతు సంఘం నాయకుడు బి.పద్మనాభ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రేట్ల విధానంలో మార్పు తీసుకొచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మండి యజమానులతో సమావేశం నిర్వహించి నోటీసులు జారీ చేశారు. అలాగే దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ మార్కెట్ యార్డులో మైక్ ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించాలని, రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకూడదని, వాటి వివరాలు మైకుల ద్వారా తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
చిప్పిలి వద్ద
చిరుత సంచారం?
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలం, చిప్పిలి వద్ద చిరుత పులి సంచారం వార్తలు శనివారం కలకలం రేపాయి. గ్రామానికి చెందిన కృష్ణకిషోర్ పొలంలో చిరుత పులి అడుగులు గుర్తించినట్లు సమాచారం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ జయప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. గుర్తులను పరిశీలించిన అనంతరం చిరు త పాదముద్రలు కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి నిర్ధారణ అయ్యే వరకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆర్టీపీపీలో
15 నుంచి ఆందోళనలు
ఎర్రగుంట్ల : విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరాల కోసం ఈ నెల 15 నుంచి దశల వారీగా చేస్తున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీపీపీలో తన యూనియన్ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఆగస్టు నెలలో చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు తెలియజేశారు.


