నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిమ్మనపల్లె మండలంలో ఓ యువకుడిపై ప్రత్యర్థులు కోడి కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ యర్రాతివారిపల్లెకు చెందిన రామక్రిష్ణ కుమారుడు ఆవల నరేష్(27) ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసి, ఇంటి ముందు రోడ్డు పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ బండపై కూర్చుని ఉండగా.. పాత కక్షలు మనసులో పెట్టుకున్న అదే ఊరికి చెందిన నవీన్, సంతోష్, లోకి ఒక్కసారిగా కోడి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్సలు అందించడంతో నరేష్ కోలుకుంటు ఉన్నాడు. నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


