మదనపల్లె టౌన్ : మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయాలపై పోలీసులు మెరుపు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు సహా పది మందిని అరెస్టు చేశారు. రెండో పట్టణ ఎస్‌ఐ నాగేశ్వరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా ఎస్పీ ధీరజ్‌కు మదనపల్లె కేంద్రంగా విచ్చలవిడిగా లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రవి నాయక్, రెండో పట్టణ ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఒకటో పట్టణ ఎస్‌ఐ రహీముల్లా సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పట్టణంలోని కోమిటివారి చెరువు సమీపాన ఉన్న జ్ఞానోదయ గ్రౌండ్‌లో ప్రశాంత్ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు జాకీర్, ఆసిఫ్ లాటరీ టికెట్లు విక్రయిస్తుం డగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మెరుపు దాడిలో విక్రేతలతోపాటు లాటరీ టికెట్లు కొంటున్న మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.6,920 నగదు, 10 లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై లాటరీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు నిర్వాహకులు సహా 10 మంది అరెస్ట్


