తిరుపతి క్రైం : తిరుపతి నగరంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఈతమాకుల వడ్డిపల్లికి చెందిన పి.భానుప్రకాష్ (26) మూడేళ్ల కిందట తిరుపతికి చెందిన వి.నాగవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భానుప్రకాష్ తన తల్లిని కలిసేందుకు వెళ్లే విషయంలో భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అతడు మానసికంగా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో భానుప్రకాష్ చీరతో ఉరివేసుకుని మృతి చెందాడు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసులు తెలిపారు.


