మదనపల్లె సిటీ : వేసవి సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ యజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో అసౌకర్యాలు స్వాగతం పలికాయి. మొదటి రోజునే పిల్లలకు విద్యామిత్ర కిట్‌లు అందజేస్తామని చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు సైతం అందించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బడి తెరిచిన రోజే అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక పంపిణీ చేసి ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా విద్యార్థులు పాత యూనిఫాం, పాత బ్యాగులు, పాత చెప్పులతో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు పుస్తకాలు అందజేశారు. బ్యాగులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొందరు తమ సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకున్నారు.
తాగునీటి కోసం అవస్థలు
మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో విద్యార్థులు తాగునీటి కోసం అవస్థలు పడ్డారు. పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేయకపోవడంతో ఇంటి వద్ద నుంచి వాటిర్‌బాటిళ్ల ద్వారా నీరు తెచ్చుకున్నారు. మరి కొందరు పాఠశాల ఆరవణలో ఏర్పాటు చేసిన క్యాన్ వాటర్‌తో దప్పిక తీర్చుకున్నారు.
’యూనిఫాం ఎప్పుడు ఇస్తారో:
విద్యార్థులకు యూనిఫాం మెటీరియల్ వచ్చింది. వాటిని విద్యార్థులకు అందజేయాలి. వాటిని టైలర్ వద్ద కుట్టించుకోవాలి. ఇదంతా సమయంతో కూడుకున్నది. కుట్టుకూలీ విద్యార్థుల తల్లి అకౌంటో పడాలి.దీనికి సమయం పడుతుంది. ఎప్పుడు కుట్టించాలి, ఎప్పుడు యూనిఫాం వేసుకోవాలో అర్థం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తొలి రోజు అంతమాత్రమే
జిల్లాలో 2255 పాఠశాలల్లో 1,93,990 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం తర్వాత మరుసటి రెండు రోజులు సెలవులు కావడంతో విద్యార్థులు పెద్దగా రాలేదు. దీంతో పాఠశాలల్లో పండగ వాతావరణం కన్పించలేదు.
పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు
అరకొరగా విద్యామిత్ర కిట్లు
తొలిరోజు అంతంత మాత్రమే
హాజరు


