ఎమ్మెల్యేపై రగిలిన తమ్ముళ్లు ! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై రగిలిన తమ్ముళ్లు !

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదు

పదవులు వదులుకుంటామని అల్టిమేటం

మంత్రితో బుజ్జగించే ప్రయత్నాలు విఫలం

సాక్షి, మదనపల్లె: కొత్తకాలంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్‌బాషాపై నిశ్శబ్దంగా ఉన్న అసమ్మతి మళ్లీ రగిలింది. తమను పట్టించుకోకుండా ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తారని పార్టీకి చెందిన అధ్యక్షులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీనిపై మూడు రోజుల క్రితం అసంతృప్తి నేతలతో ఎమ్మెల్యే సమావేశమై సంతృప్తిపరచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గురువారం మదనపల్లెకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా అసంతృప్తులను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

మూడు రోజులు క్రితం..

ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, కనీస ప్రాధాన్యత లేదని ఆరు నెలలుగా మదనపల్లె పట్టణ, రూరల్‌, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల పార్టీ అధ్యక్షులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై అధిష్టానం సూచనతో నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో అసంతృప్తి మళ్లీ బహిర్గతం కావడంతో దీన్ని చల్లార్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మూడు రోజుల క్రితం అధ్యక్షులతో ఎమ్మెల్యే సమావేశం అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరిస్తానని చెప్పినప్పటికీ..మాటలకే పరిమితమైంది, పార్టీ అధ్యక్షులుగా ఉండి తమకు దక్కిన గౌరవం, ప్రాధాన్యత ఏముందని నిలదీసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, అప్పుడు మీరు దీనికి మమ్మల్ని కారకులుగా చేస్తే అప్పుడు మా పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యేను ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓటమి భారం మోయడంకంటే పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తామని అల్టిమేట్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. వీరిలో ఒక మండల పార్టీ అధ్యక్షుడు..ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మండలంలోని 19 పంచాయతీల్లో రెండింటిలోనే గెలుస్తాం..ఈ ఓటమికి నేను బాధ్యత వహించాలా అని సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. మిగిలిన అధ్యక్షులు ఇలాగే అసంతృప్తి వ్యక్తంచేసి వచ్చేసినట్టు తెలిసింది. ఈ సమావేశం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీయడంతో పోలీసు నిఘా వర్గాలు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

బుజ్టగింపు యత్నాలు విఫలం

ఎమ్మెల్యే షాజహాన్‌ బాషాపై ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు గురువారం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌లతో మాట్లాడించి బుజ్జగించేందుకు ఎమ్మెల్యే వర్గం నుంచి పార్టీ పట్టణ, మండలాల అధ్యక్షులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒకరు కూడా హాజరు కాలేదని తెలిసింది. కొందరైతే తాము పార్టీ కార్యాలయానికి వస్తామని చెప్పినట్లు తెలిసింది. దీంతో మంత్రితో బుజ్జగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement