జిల్లాకు మదనపల్లె పేరు ఉంచాలి
మదనపల్లె రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంపై స్థానికులు సంతోషంగా లేరని, జిల్లాకు మదనపల్లె పేరు పెట్టాలని మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అన్నమయ్య పేరుతోనే జిల్లా కేంద్రంగా మదనపల్లె అంటూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు. మదనపల్లె పవిత్రభూమి, మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత మాది అని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మదనపల్లె జిల్లా 114 సంవత్సరాల ఆకాంక్ష అని, నెరవేరుతోందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో మదనపల్లె పేరుతో జిల్లా ఉండదన్న ప్రకటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. సమావేశంలో జిల్లా సాధనసమితి సభ్యు లు ముత్యాలమోహన్, చాట్ల బయన్న, రెడ్డిప్రసాద్, రాయల్ సూరి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.


