పిల్లల కోసం గేటు వద్ద నిరీక్షణ
వాల్మీకిపురం : స్థానిక తరిగొండ రోడ్డులోని ఏపీ ఉర్దూ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు గేటు బయటే నిరీక్షించాల్సిన దుస్థితి ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం స్థానిక ఉర్దూ మైనార్టీ బాలికల పాఠశాలలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పినా పాఠశాల యాజమాన్యం లోనికి అనుమతించ లేదని రాయచోటి, సుండుపల్లికు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అహమ్మద్‌బాషా, ఖాదీరూన్‌లు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మెయిన్ గేటు వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ నవమల్లిక మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి నెల రెండవ శనివారం మాత్రమే తల్లిదండ్రులకు అనుమతి ఉంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు తమ పిల్లలను చూడాలని వస్తే అనుమతించేది లేదని తెలిపారు.


