నందలూరు చెరువులో రూ.40 లక్షల కేంద్ర నిధులు నీళ్లపాలు
నందలూరు : నందలూరు కన్యకల చెరువులో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ డెవలప్‌మెంట్ పథకానికి సంబంధించి రూ.45 లక్షలతో నిర్మించతలపెట్టిన చిల్డ్రన్‌పార్కు నిధులు నీళ్లపాలయ్యాయి. ఈ విషయంపై సోమవారం స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. నందలూరు కన్యకల చెరువులో చిల్డ్రన్ పార్కు నిర్మాణంపై వైస్ ఎంపీపీ అనుదీప్ అభ్యంతరం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ సీఈఓ ఈ నిర్మాణం చూసి వెళ్లినప్పటికి లక్షలాది రూపాయలు బిల్లుచేసి కాంట్రాక్టర్ చేతికి అందజేశారన్నారు. చిల్డ్రన్‌పార్కు నిర్మితంపై పర్యవేక్షణ కొరవడిందని, ఏ విధంగా కేంద్రం నిధులను మంజూరు చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటిలో పార్కు ఉందని, ఎవరికీ ఉపయోగపడటంలేదని, గుడ్డిగా బిల్లు చేయడం వెనుక సీఈఓ ఆంతర్యమేమిటని ధ్వజమెత్తారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నిర్మాణానికి చెరువులో అనుమతులు ఏ విధంగా ఇచ్చారన్నదే ఇప్పుడు అంతుపట్టిన అంశమన్నారు. ఇదే విషయంపై ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి కూడా చెరువులో చిల్డ్రన్‌పార్కు కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం బిల్లు మంజూరు చేసినట్లుగా ఉందని జెడ్పీ సీఈఓ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మండల పరిషత్‌లో తీర్మానం చేయాలని ఎంపీపీ మేడా అధికారులను ఆదేశించారు. తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్, కేంద్రానికి పంపాలన్నారు.
అంగన్‌వాడీల పనితీరుపై అసంతృప్తి
మండలంలో అంగన్‌వాడీల పనితీరుపై మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రభుత్వ లక్ష్యాలను అంగన్‌వాడీ సెంటర్ల నిర్వాహకులు అధిగమించడంలేదన్నారు.
గౌరవవేతనం ఇవ్వండి మహాప్రభో..
మండల పరిషత్ సమావేశంలో ఎంపీటీసీలు తమకు రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వండి మహాప్రభో అని మండల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మండల కో–ఆప్షన్ సభ్యుడు కలీం మాట్లాడుతూ ఇంతవరకు ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ అమరేశ్వరి, ఎంపీడీఓ కేఆర్‌ఎం ప్రసాద్, వైస్ ఎంపీపీలు అనుదీప్, తుమ్మల భావన, ఎంపీటీసీలు కొండూరు రమేష్‌బాబు, మోదుగుల సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
కన్యకలచెరువులో మునిగిన
చిల్డ్రన్ పార్కు
మండల మీట్‌లో వైస్ ఎంపీపీ
అనుదీప్ ధ్వజం
కొరవడిన పర్యవేక్షణ..బిల్లుల మంజూరు
జెడ్పీ సీఈఓ వైఖరిపై ఎంపీపీ మేడా ఆగ్రహం


