యువకుడిపై హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు
కడప అర్బన్ : మద్యం మత్తులో పవన్ అనే యువకుడిపై పిడిబాకుతో దాడి చేసిన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. సోమవారం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌న్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 25న శంకరాపురం నివాసి నల్లిపోగు పవన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా తన అమ్మమ్మ దండు వీరమ్మ నివాసమైన మాసాపేటకు వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం దొరలగోరీల వద్ద మద్యం తాగుతున్న మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబుల వద్దకు పవన్ వెళ్లాడు. అందరూ కలిసి మొదట మద్యం తాగారు. పవన్‌కు హర్షవర్దన్‌కు మధ్య మనస్పర్థలు ఉండేవి. గతంలో తనపై కేసులు ఉన్నాయంటూ గంజాయి అమ్ముతున్నట్లు ప్రచారం చేసి అల్లరి పాలు చేశావంటూ హర్షవర్దన్ పవన్‌ను దూషించాడు. దీంతో పవన్ అక్కడి నుంచి నిర్మల కాన్వెంట్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ముగ్గురు పవన్‌ను వెంబడించి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్ పిడిబాకుతో పవన్‌పై దాడికి యత్నించగా, తప్పించుకునే క్రమంలో పవన్ తలపై తీవ్ర రక్తగాయమైంది. అదే సమయంలో గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబులు పవన్‌న్‌ను కింద పడేసి కొట్టారు. పవన్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని అతని మేనమామ దండు పెంచలయ్య 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన పిడిబాకును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గజ్జల ఏసుబాబు పరారీలో ఉన్నాడని తెలిపారు.
గొడవల జోలికి వెళితే తాట తీస్తాం
శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. గొడవలకు వెళ్లినా చూస్తూ ఊరుకోమని వారి తాటతీస్తామని టూటౌన్ సీఐ ప్రసాద్ రావు హెచ్చరించారు. యువకునిపై దాడి చేసిన కేసుకు సంబంధించి ఇరువురు నిందితులను సోమవారం సాయంత్రం మాసాపేట సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ వరకు పోలీసులు నడిపించారు.


