ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల మెరుపుదాడి
● రూ. 61 లక్షల విలువైన దుంగలు స్వాధీనం
● ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం రవాణాపై పోలీసులు మెరుపుదాడి చేసి రూ. 61 లక్షలు విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున చేపట్టిన దాడిలో ఎర్రచందనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. తమిళనాడు స్మగ్లర్లతో చేతులు కలిపి కొందరు స్థానికులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో వీరబల్లి మండల పరిధిలోని కురవపల్లి–ఉప్పరపల్లి రోడ్డు దేవదాశి చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 617 కేజీల బరువు ఉన్న 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ సుమారు రూ. 61,70,000 ఉంటుందన్నారు. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నమయ్య జిల్లా, గడికోట గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల చంద్రమోహన్ (38), తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాకు చెందిన రమేష్ వట్టన్ (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో వీరబల్లి మండలానికి చెందిన ఇద్దరు, రాయచోటి మండలానికి చెందిన ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం మేరకు సమర్థవంతంగా పనిచేసి కేసును ఛేదించిన రాయచోటి రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కె రోషన్, రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ టీవీ కొండారెడ్డి, వీరబల్లి ఎస్‌ఐ సుస్మిత, టి.సుండుపల్లి ఎస్‌ఐ హుస్సేన్ వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


