వెలగచర్లలో కూటమి నాయకుల భూకబ్జా
పెనగలూరు : పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ వెలగచర్ల రెవెన్యూ పొలంలో ఆదివారం ప్రభుత్వ భూమిని (ఏడబ్ల్యూ) కూటమి నాయకులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ అమరేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. వెలగచర్ల రెవెన్యూ పొలంలో సర్వే నంబర్లు 676, 871, 880, 883, 874లతోపాటు మరికొన్ని సర్వే నంబర్లతో కలిపి ప్రభుత్వ భూమి దాదాపు 102 ఎకరాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ భూమిని దాదాపు 12 సంవత్సరాలుగా గ్రామ ప్రజలు కలిసికట్టుగా కబ్జా కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ భూమిపై జేసీ కోర్టులో కూడా పెండింగ్‌లో ఉన్నట్లు వారు వివరించారు. అయినప్పటికీ ఈనె 28వ తేదీన ఆదివారం సెలవు కావడంతో కూటమి నాయకులు జేసీబీ, డోజర్లు పెట్టి పట్టపగలే ప్రభుత్వ భూమిని చదును చేశారని వారు తెలిపారు. రెవెన్యూ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే 30 ఎకరాలకుపైగా భూమిని జేసీబీతో చదును చేశారన్నారు. కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ చదును చేసిన భూమిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
వెలగచర్లలో కూటమి నాయకుల భూకబ్జా


