ప్రత్యేక కమిషన్‌తో బీసీ కులగణన చేపట్టాలి
మదనపల్లె రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన నిర్వహించాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజనసేన ఆధ్వర్యంలో బీసీ ప్రతిఘటన నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల కులగణన చేపట్టి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–340 ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేసే దిశగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాల తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ సాంబశివ, ఏఐటీయూసీ ముబారక్, వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు, వడ్డెర సంఘం కృష్ణయ్య, బీసీ ఆటోయూనియన్ రాఘవేంద్ర యాదవ్, విద్యార్థి సంఘ నాయకులు ఉత్తన్న, రజకసంఘం నాయకుడు ఎస్కే.రెడ్డెప్ప, మైనారిటీ నాయకులు ఇస్మాయిల్, పౌరహక్కుల సంఘం నాగేశ్వరరావు, బహుజనసేన జయశంకర్ పాల్గొన్నారు.


