
పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పొగాకు రహిత సమాజాన్ని నిర్మించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జాతీయ పొగాకు నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీవాణి కోరారు. గురువారం రాయచోటిలోని డైట్ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ సిగరెట్టు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని, పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారిచేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఎం.నర్సింహారెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుమతి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి, అధ్యాపకులు శివభాస్కర్, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.