
స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ
సిద్దవటం : స్థల వివాదం విషయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. సిద్దవటం మండలంలోని మాధవరం–1 గ్రామం రోడ్ నెంబర్ 1 పెద్దపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 87/2లో 20 సెంట్ల స్థలంలో మాధవరం గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి గురువారం గృహ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే ఆ స్థలం తనదని గాలి సుబ్రమణ్యం మరికొంత మంది నిర్మాణ పనులకు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో విజయ్ అనే వ్యక్తి తలకు బలమైన గాయాలు తగలడంతో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు, వీఆర్‌ఓ రేణుక సంఘటన స్థలానికి చేరుకుని గృహ నిర్మాణ పనులు నిలుపుదల చేయించారు. ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బాత్రూమ్‌లో జారిపడి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది.
దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన మల్లికార్జున, గంగాదేవి దంపతుల కుమారుడు ప్రదీప్(9) స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉదయం విరామ సమయంలో బాత్రూమ్‌కు వెళ్లాడు. అదే సమయంలో బయట గుడివద్ద మేళతాళాల శబ్దం రావడంతో ఊరేగింపు చూసేందుకు బాత్‌రూమ్‌లోని గోడకు అమర్చిన పలకలపై ఎక్కి చూసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గోడ పలక విరిగిపోవడంతో జారి కిందపడ్డాడు. కిందపడే సమయంలో పలకకు అమర్చిన టైల్స్ మొన పదునుగా ఉండటంతో కడుపులో గుచ్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట పేగులు సైతం బయటకు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.

స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ