
వైద్యం ప్రజల హక్కు
● అమలు బాధ్యత ప్రభుత్వానిదే
● మెడికల్ కళాశాల పరిరక్షణకు
ప్రజా ఉద్యమం
మదనపల్లె : మెరుగైన వైద్య సేవలు పొందడం ప్రజల ప్రాథమిక హక్కు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ యం.గేయానంద్ అన్నారు. ప్రభు త్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, భారత విద్యార్థి ఫెడరేషన్ సంయుక్త నిర్వహణలో మదనపల్లె పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో గురువారం సమావేశం జరిగింది. గేయానంద్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో పీపీపీ అమలు చేయడం ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పీపీపీ ద్వారా ప్రైవేట్‌కు అప్పగించడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. ఈ విధానం వల్ల ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వెయ్యి సీట్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యవేదిక అధ్యక్షుడు ఎంవి రమణయ్య మాట్లాడుతూ ఆస్పత్రులు కూడా ప్రైవేటీకరణ అవుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరుతూ ఈ నెల 27న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రవేశపెట్టిన తీర్మానానికి సదస్సు ఆమోదం తెలిపింది.
వీసీకే పార్టీ రాష్ట్ర నాయకుడు పీటీఎం శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పా టు చేసే 300 పడకల ఆస్పత్రితోనే పేద రోగులకు వైద్యసేవలు అందుతాయన్నారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్, జనవిజ్ఞాన వేదిక నాయకుడు టి.హరీంద్రనాథ్ శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో కవి పోతబోలు రెడ్డెప్ప, సీఐటీయూ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆఫ్రిద్, షామీర్, ఐద్వా నాయకులు భాగ్యమ్మ, రెడ్డి ప్రసన్న, అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజేశ్వరి, మధురవాణి, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు మల్లీశ్వరి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.