కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు

Oct 10 2025 8:06 AM | Updated on Oct 10 2025 8:06 AM

కూటమి

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు

లక్కిరెడ్డిపల్లి : కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన రేషన్‌ డీలర్లపై కడప విజిలెన్సు అధికారులు 6ఏ కేసులు నమోదు చేస్తున్నారని, సంబంధిత డీలర్లను పరుషపదజాలంతో విజిలెన్సు సీఐ నారాయణరావు బూతులు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. గురువారం మండలంలోని దిన్నెపాడు గ్రామం, నరసింహరాజుగారిపల్లికి చెందిన చౌక దుకాణం 1136007 రేషన్‌ షాపు తనిఖీకి వచ్చిన విజిలెన్సు సీఐ నారాయణరావు తనిఖీల్లో ఎలాంటి వ్యత్యాసం లేకున్నా తనకు ఇష్టం వచ్చినట్లు కేసు రాశారని సంబంధిత డీలర్‌ నాగరాజు వాపోయారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం దుకాణంలో డీలర్‌ అందుబాటులో లేని విషయాన్ని గుర్తించిన గ్రామంలోని కొందరు కూటమి నేతలు రేషన్‌ దుకాణం ఇంటి పైన వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న రంధ్రం ద్వారా కొంతమేర బియ్యాన్ని కిందకు పోశారని.. ఆ తర్వాత గ్రామానికి కూతవేటు దూరంలో అందుబాటులో ఉన్న విజిలెన్సు వారికి సమాచారాన్ని అందజేసి హుటాహుటిన రేషన్‌ దుకాణంలోకి చొరబడి తాళాలు తెరిపించి ఉన్న స్టాకును సీఐ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇంటిపైన ఉన్న రంధ్రం నుంచి కూటమి పార్టీకి చెందిన కొందరు రేషన్‌ దుకాణంలోకి కొంతమేర బియ్యాన్ని పోసిన విషయాన్ని విజిలెన్సు సీఐ నారాయణరావుతోపాటు సంబంధిత తహసీల్దార్‌ క్రాంతి కుమార్‌, ఆర్‌ఐ రాజేష్‌, సిబ్బందికి ప్రత్యక్షంగా చూపించినప్పటికీ అవన్నీ సంబంధం లేదు స్టాక్‌ ఉన్నంత మేరకే తాము లెక్కించి కేసు నమోదు చేస్తామని చెప్పారని వారు వాపోయారు. అక్కడ నిల్వ ఉన్న ఏడు క్వింటాళ్ల, 90 కేజీల బియ్యానికి ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికి సరుకును అప్పగించి వెళ్లినట్లు డీలరు నాగరాజు తెలిపారు. అనంతరం దప్పేపల్లి గ్రామం, గొల్లపల్లిలోని చౌక దుకాణం 1136016కు చెందిన బాలే పెద్ద ఓబులేశు దుకాణాన్ని తనిఖీ చేసి ఎలాంటి వ్యత్యాసం లేకపోయినా ఆథరైజేషన్‌ లేదనే నెపంతో 6ఏ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏ ఒక్క డీలర్‌కు కూడా నాలుగేళ్లుగా ఆథరైజేషన్‌ లేదనే విషయం సంబంధిత డీలర్‌ ఓబులేశు విజిలెన్సు సీఐ ఎదుట ప్రస్తావించగా వినకపోవడంతో చేసేదేమీలేక మిన్నకుండిపోయామన్నారు. ఇదే మండలంలో గత నెలలో తనిఖీకి వచ్చిన విజిలెన్స్‌ సీఐ నారాయణరావు వరుసగా మూడు రేషన్‌ దుకాణాలు తనిఖీ చేసి డీలర్లపై నోరుపారేసుకున్నారన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ కూటమి నేతలకు రెవెన్యూ సిబ్బంది పర్మినెంటు రేషన్‌ డీలర్ల సరుకును అప్పగించడంపై పలువురు మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొత్తులుగా మారిన విజిలెన్సు సీఐ నారాయణరావు, రెవెన్యూ సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లకు ఫిర్యాదు చేస్తామని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు.

కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల షాపులపై 6ఏ కేసులు నమోదు

ఎలాంటి ఆథరైజేషన్‌ లేకుండానే టీడీపీ నేతల ఇళ్లల్లో సరుకును అప్పగించిన రెవెన్యూ సిబ్బంది

ఆథరైజేషన్‌ లేదని 6ఏ కేసు రాశారు..

నా రేషన్‌ షాప్‌ తనిఖీకి వచ్చిన విజిలెన్సు సీఐ నారాయణరావు ఎలాంటి వ్యత్యాసాలు లేకపోయినా కేవలం ఆథరైజేషన్‌ లేదనే కారణం చూపిస్తూ 6ఏ కేసు నమోదు చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఒక్క షాపునకు కూడా నాలుగేళ్లుగా ఆథరైజేషన్‌ లేదనే విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగుదేశం వారికి తొత్తులుగా మారి ఉద్యోగం చేస్తూ ఏ తప్పు లేకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు.

బాలేపెద్ద ఓబులేశు, గొల్లపల్లి, దప్పేపల్లి గ్రామం,

లక్కిరెడ్డిపల్లి మండలం

రేషన్‌ షాప్‌ మిద్దైపె నుంచి బియ్యం పోశారు..

మేము ఇంటివద్దలేని సమయంలో మా పల్లెలోని కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మా మిద్దైపె ఉన్న గవాచీ ద్వారా కొంత బియ్యాన్ని గుమ్మరించారు. ఐదు నిమిషాలలోపే విజిలెన్సు సీఐ నారాయణ రావు తన బృందంతో వచ్చి స్టాకును స్వాధీనం చేసుకున్నారు. గవాచి ద్వారా పోసిన బియ్యాన్ని విజిలెన్సు అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందికి చూపించినా కూడా వినకుండా 70 కేజీలు అదనంగా ఉన్నట్లు చూపిస్తూ నా షాపుపై 6ఏ కేసు నమోదు చేశారు.

నాగరాజు, నరసింహరాజుగారిపల్లి,

ప్రభుత్వ చౌకదుకాణం డీలర్‌, లక్కిరెడ్డిపల్లి మండలం

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు1
1/2

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు2
2/2

కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement