
భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలు
రాయచోటి టౌన్ : భార్యను చంపిన కేసులో భర్తకు ఏడేళ్ల జైలుతో పాటు రూ.1,70,000లు జరిమానా విధిస్తూ జిల్లా 7వ అదనపు న్యాయమూర్తి జి. ఎస్ రమేష్ కుమార్ తీర్పు చెప్పారు. రాయచోటి సబ్ డివిజన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె, కొండవాండ్లపల్లె గ్రామానికి చెందిన సావిత్రిని లక్కిరెడ్డిపల్లె మండలం వడ్డెపల్లె దిన్నెపల్లెకు చెందిన రౌతు బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహమైన కొద్ది సంవత్సరాలకే తమ కుమార్తెను అల్లుడు చంపాడని మృతురాలి తండ్రి 2021 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై గురువారం కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్ 498(ఏ), 304 (బి), 3అండ్4 డీపీ యాక్టు ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు జీవితంతో పాటు రూ.1,70,000లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును పర్యవేక్షించిన డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ డి. రవీంద్రబాబులను జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి అభినందించారు.