
నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ
రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖలు విద్యారంగంలో అవలంబిస్తున్న ప్రయోగాలను, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఫ్యాప్టో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ విజయవాడలో జరిగిన ఫ్యాప్టో రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం నుంచి అమలుకు శ్రీకారం చుడుతున్నారు.ఈమేరకు గురువారం ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.బోధనేతర కార్యక్రమాలు వల్ల బోధనా సమయం హరించుకుపోతోందని, ఉపాధ్యాయులకు బోధనపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తోందని పేర్కొన్నారు. కావున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జాబిర్, జనరల్ సెక్రటరీ గఫార్ ఖాన్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపడతారన్నారు. మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ తప్ప బోధనేతర పనులను, అనవసరమైన గూగుల్ షీట్స్ నింపడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని తెలియజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో–చైర్మన్‌లు శివారెడ్డి, సిబాతుర్రహ్మాన్, పి మహమ్మద్ ఇలియాస్, కోశాధికారి జాఫరుద్దీన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ హరిబాబు, ఫ్యాప్టో నాయకులు సురేంద్రరెడ్డి, టి శివారెడ్డి, రెడ్డయ్య, దావుద్దీన్, అంజద్‌బాషా శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.