
సాక్షి, చిత్తూరు: ఏపీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెడ్ యార్డ్ పర్యటనపై కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చి.. ఫొటోగ్రాఫర్‌పై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా ఫొటోగ్రాఫర్ శివపై దాడి కేసులో అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చక్రి, జీడి నెల్లూరుకు చెందిన మోహన్‌లను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, చిత్తూరు డీటీసీకి తరలించారు. అయితే, వారిని మాత్రం పోలీసులు చూపించడం లేదు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా మోహన్ భార్య రాసాత్తి మాట్లాడుతూ..‘నా భర్త ఆరోగ్యం సరిగా లేదు.. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. రోజుకు మూడు సార్లు మందులు వేసుకోవాలి.. మూడు రోజులుగా పోలీసులు నిర్బంధంలో ఉన్నాడు.. నా భర్త మోహన్‌కు ఏం జరిగినా పోలీసులు, జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలి. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం.. నా భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారు’ అని అన్నారు.
చక్రి భార్య కవిత మాట్లాడుతూ..‘ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయక పోయినా నా భర్తను అరెస్ట్ చేశారు. బాధితుడు ఫొటోగ్రాఫర్ శివ కూడా చక్రి నా కెమెరా కాపాడాడు.. నన్ను రక్షించాడు అని చెప్తున్నా నా భర్తపై తప్పుడు కేసు పెడుతున్నారు’ అని తెలిపారు.
