
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి.
𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨
During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025
తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది.

ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.