
తాడేపల్లి: ఐపీఎస్ ఆఫీసర్ని రేయ్ అంటూ సంబోధించిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం, జూలై 22) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఉద్యోగులు, అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తన సొంత రాజ్యాంగాన్ని అధికారులపై జేసీ ప్రదర్శిస్తానంటే కుదరదు.
ఐపీఎస్ ఆఫీసర్‌ని సైతం రేయ్ అంటూ సంబోధించడం మంచి పద్దతి కాదు. నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తానంటూ బెదిరించటం ఏంటి?. ఉద్యోగుల గౌరవం కాపాడుతానన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు?, జేసీ ప్రభాకరరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జేసీ వలన ఏ అధికారి, ఉద్యోగి కూడా ప్రశాంతంగా పని చేయలేకపోతున్నారు. నీతి, నిజాయితీలతో పని చేసే ఆఫీసర్లని ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తారా?, టీడీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. హిందూపురంలో పారిశుధ్య కార్మికురాలిపై సైతం టీడీపీ నేత వేధింపులకు పాల్పడ్డాడు. ఇలాంటి వారందరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగుల పక్షాన ఆందోళన చేస్తాం
కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరుపారేసుకున్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు. ‘మాకు ఒక ఏఎస్పీ వచ్చారు. మొదట్లో డీఎస్పీ చైతన్య బాగున్నాడు. తరువాత చెడిపోయినాడు. ఇప్పుడు ఒక ఏఎస్పీ ఉన్నారు. ఈయన మరో చైతన్యలా తయారయ్యారు.
ఈయన వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టాడు. పోలీసు బందోబస్తు పెట్టి టవర్ నిర్మిస్తావా? వైఎస్సార్‌సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నావ్.. ఎంత ముట్టింది నీకు? ఏం తెలుసు నీకు .. ఐదేళ్లు కష్టపడ్డాం రోయ్.. బస్సులు పోయినాయి.. అన్నీ పోయినాయి.. నువ్వు న్యాయం చేస్తావా..రా.. బుధవారం నీ పోలీసోళ్లు.. నువ్వు రా.. మా రైతాంగం ముందు ఉంటుంది. బుధవారం ఏఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేస్తాం. నీ చేతనైతే అడ్డుకో... పోలీస్ పవర్ ఏందో చూపించు’ అని పళ్లు కొరుకుతూ ఊగిపోయారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.