దస్తగిరి కేసులో హైటెక్‌ కుట్ర..! | Ysr Kadapa District: Conspiracy In The Dastagiri Case | Sakshi
Sakshi News home page

దస్తగిరి కేసులో హైటెక్‌ కుట్ర..!

Apr 21 2026 7:13 AM | Updated on Apr 21 2026 8:32 AM

Ysr Kadapa District: Conspiracy In The Dastagiri Case

సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్‌ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్‌ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్‌ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్‌ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్‌ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేయడంపై   విస్మయం వ్యక్తమవుతోంది.

రిమాండ్‌ రిపోర్ట్‌లో వైఎస్సార్‌సీపీ నేతల ప్రస్తావన
కడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో వారు చెప్పినట్లు కాల్‌ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్‌తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్‌ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.

మాజీ సీఎం జగన్‌ వస్తారని..
ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారని సోషల్‌ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్‌ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్‌ కాల్‌ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్‌సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. 

డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్‌
ఈ నెల 6వ తేదీన అలంఖాన్‌పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్‌ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్‌పల్లె నుంచి రిమ్స్‌కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో రిమ్స్‌కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్‌ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్‌ నిత్యానందరెడ్డి టార్గెట్‌గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.

వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్‌ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది.  పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
కడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్‌ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్‌ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్‌ట్యాప్‌ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement