వైరల్‌ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష 

YSR Aarogyasri Scheme for Viral Fevers Andhra Pradesh - Sakshi

పథకం కింద ఉచితంగా చికిత్స చేస్తున్న ప్రభుత్వం 

ఎలీసా నిర్ధారణతోసంబంధం లేకుండానే డెంగ్యూకి ఉచిత వైద్యం 

జనవరి నుంచి ఆగస్టు చివరకు మలేరియాకు ఉచిత చికిత్స పొందిన 689 మంది 

డెంగీకి ఉచిత వైద్యం పొందినవారి సంఖ్య 6,343

సాక్షి, అమరావతి: సీజనల్‌ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్‌ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది.  

7,032 మందికి చికిత్స 
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్‌ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్‌ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్‌ కిట్‌లో పాజిటివ్‌ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు.   

పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. 
ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్‌ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్‌)తో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్‌ జ్వరాల బారినపడి.. ప్లేట్‌లెట్స్‌ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం.     
– డాక్టర్‌ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top