నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు | YS Vivekananda Reddy PA Krishna Reddy on sunitha and Rajasekhar Reddy | Sakshi
Sakshi News home page

నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

May 8 2024 4:26 AM | Updated on May 8 2024 10:33 AM

YS Vivekananda Reddy PA Krishna Reddy on sunitha and Rajasekhar Reddy

రక్తపు వాంతులని నేను చెప్పలేదు

వివేకా లేఖ దాచిపెట్టమని చెప్పింది రాజశేఖరే

అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ తీవ్రంగా కొట్టాడు

సునీత, రాజశేఖర్‌ నన్ను హైదరాబాద్‌కు పిలిపించుకుని బెదిరించారు

నా కుమారుడి వివాహాన్ని రద్దు చేయించారు

వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి

పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజ­శేఖర్‌­రెడ్డి చాలా నీచంగా మాట్లా­డుతున్నారని వైఎస్‌ వివేకా­నందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రి­కకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధా­లేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్‌­మెంట్లు ఇస్తున్నారన్నారు. 

నర్రెడ్డి బ్రదర్స్‌ నాటకాలాడుతు­న్నా­రని చెప్పారు. వైఎస్‌ వివేకా రక్తపు వాంతులతో చనిపో­యా­డని తాను నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డితో చెప్పలేద­న్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్‌ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. 

అలాంటిది రాజశేఖర్‌­రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్‌ వివేకా లెటర్‌ను దాచిపెట్టడా­నికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్‌ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పగా ఆయనే దాచమ­న్నా­రని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే  ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నా­రు.

అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్‌ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్‌ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్‌ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్‌ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగా­నికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమో­షన్, పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.



తాను వైఎస్‌ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలి­పారు. నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మన­స్పర్థలు వచ్చాయన్నారు.

 వివేకా రెండో భార్య షమీమ్‌ కుమా­రుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వా­రా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తు­న్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్‌ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ము­ందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నా­రు. 

రామ్‌సింగ్‌ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారు
ఓసారి సునీత దంపతులు తనను హైదరా­బా­ద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్‌ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరా­ఖండిగా చెప్పా­న­న్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖ­ర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్ప­టికైనా ఈ కేసులో రాజశేఖర్‌ జైలుకు వెళ్లక తప్పదన్నారు.

వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్‌ కొట్టాడు
ఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆ­తర్వాత ఒకరోజు రామ్‌సింగ్‌ వాట్సప్‌ కాల్‌ చేసి తన కుమా­రుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.

తామిద్ద­రం మరుసటిరోజు రామ్‌సింగ్‌ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టె­తో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్‌ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికి­స్తామని చెప్పాడన్నారు. తన బెయిల్‌ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను  అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. 

కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్‌ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్‌ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకు­న్నారని తెలిపారు.

నాకేదైనా జరిగితే వారిదే బాధ్యత
తనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement