
నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం
వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు ఇచ్చాం
నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు
ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం
నేతన్నలకు వివిధ పథకాల కింద రూ.3,706.16 కోట్లు సాయం అందించడం ఓ రికార్డు
ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్‌కు రాయితీపై విద్యుత్ అందించాం
చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్‌తో నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం
ఈ పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆపేసి, ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిందంటూ ఆగ్రహం
అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలనూ చంద్రబాబు వంచించారు.. మోసం చేశారని ధ్వజం
సాక్షి, అమరావతి: నేతన్నల జీవితాలు బాగు పడాలన్న ఆకాంక్షతో వైఎస్సార్‌సీపీ హయాంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేసి ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచామని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ గురువారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తమ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేస్తూ అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను సైతం చంద్రబాబు మోసం చేసిన వైనాన్ని ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..
నేతన్నలకు రూ.3,706.16 కోట్ల సాయం చేశాం..
ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘సంత్ కబీర్’’ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్‌లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు అభినందనలు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి అడుగులోనూ నేతన్నలకు అండగా నిలిచాం.
మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ఏటా రూ.24,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం.
అంతేకాదు.. వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు మేర సాయం చేశాం. ఇది ఒక రికార్డు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్‌కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం.
ఏ రకంగా ఆదుకున్నట్లు..?
ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపివేయడంతోపాటు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్‌టీ రీయింబర్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే
దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. కానీ రెండు బడ్జెట్‌లలో ఈ ప్రభుత్వం పెట్టింది సున్నా. పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. కానీ 14 నెలలు గడిచినా అమలు చేయలేదు.

కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు గానీ విద్యుత్తు చార్జీలు అమాంతం పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19 వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు? పత్రికల్లో ప్రకటనలు మినహా ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు.