
సాక్షి, తాడేపల్లి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్‌లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు (పొందూరు)లకు ఆయన అభినందనలు తెలిపారు.
‘‘నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 'వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.969.77 కోట్లు, నేతన్నల పింఛన్ కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు రూ.468.84 కోట్లు చెల్లించాం. అంతేకాదు వివిధ పథకాల ద్వారా నేతన్నలకు రూ.3,706.16 కోట్లు సాయం చేశాం. ఇది ఒక రికార్డు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీపై విద్యుత్ అందించాం. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా ప్రతి అడుగులోనూ చేనేతలకు అండగా నిలిచాం. ఈ ప్రభుత్వం చేనేతలకు నడుస్తున్న పథకాలను ఆపేసి ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. జీఎస్‌టీ రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. రెండు బడ్జెట్‌లలో పెట్టింది సున్నా.
ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్న నేతన్నలందరికీ శుభాకాంక్షలు.
ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా సంత్ కబీర్ అవార్డు అందుకుంటున్న లక్క శ్రీనివాసులు (తిరుపతి), నేషనల్ హ్యాండ్‌లూమ్ అవార్డులు అందుకుంటున్న కర్నాటి మురళి (చీరాల), జుజరె నాగరాజు… pic.twitter.com/x0ewriEn5z— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2025
..పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. 14 నెలలు గడిచినా అమలు చేయలేదు. కరెంటు సబ్సిడీ ఇవ్వలేదు, కానీ కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు రూ.19వేల కోట్ల మేర కరెంటు షాక్ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం చేనేతలను ఏ రకంగా ఆదుకున్నట్లు?. పత్రికల్లో ప్రకటనలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచించారు, మోసం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.