YS Jagan High-level Review Health Hubs Hospital Management Covid Control - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట

Sep 15 2021 2:02 AM | Updated on Sep 15 2021 12:21 PM

YS Jagan high-level review health hubs hospital management covid control - Sakshi

హెల్త్‌ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అనుసరించాలి. ఆరోగ్యం బాగోలేకపోయిన వారంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలి.          
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్‌ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. హెల్త్‌ హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు.

వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్‌ హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్‌ హబ్స్‌ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
► ఆస్పత్రుల నిర్వహణలో భాగంగా బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి.

► కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్మాణాలు ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యం. 

► రిసెప్షన్‌ సేవలు కూడా కీలకం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే.. కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయి.

► జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను వినియోగించాలి. విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాలను, ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)లను ఖరారు చేయాలి. పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలి. ఒక డాక్టరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. 

► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్‌ 15 నుంచి 258 మండలాల్లో, జనవరి 26 నుంచి రాష్ట్రం అంతటా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయనున్నామని చెప్పారు. 

► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి 
► మొత్తం యాక్టివ్‌ కేసులు : 14,652
► పాజిటివిటీ రేటు శాతం : 2.23 
► రికవరీ రేటు శాతం : 98.60 
► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,699
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 854 
► నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 91.66 
► ప్రైవైట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 71.04 
► 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ : 753
► ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వేలు : 21 
► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,541
► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు : 9
 
థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డీ టైప్‌ సిలెండర్లు : 27,311
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు : 20,964
► ఇంకా రావాల్సినవి : 2,493
► 50 కంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటు.
► అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్‌ఏ ప్లాంట్లు

 వ్యాక్సినేషన్‌
► సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు : 1,33,30,206
► రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు : 1,08,54,556
► సింగిల్, డబుల్‌ డోసులు పూర్తయిన వారు : 2,41,84,762
► వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించిన మొత్తం డోసులు : 3,50,39,318  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement