రికార్డు అంటే మాదే.. | YS Jagan Fires on CM Chandrababu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రికార్డు అంటే మాదే..

Jun 12 2026 4:41 AM | Updated on Jun 12 2026 4:41 AM

YS Jagan Fires on CM Chandrababu: Andhra pradesh

నాలుగు నెలల వ్యవధిలో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశాం

అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాం

రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఉద్యోగాల భర్తీలో సువర్ణాధ్యాయం లిఖించాం

టీచర్‌ పోస్టుల భర్తీలో అక్రమాలకు తెరతీసి రికార్డు అంటూ 

చంద్రబాబు సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారు..

సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర 
సృష్టించామన్నారు.

ఒకే నోటిఫికేషన్‌ ద్వారా..
2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్‌ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.

మే 30 నుంచి అక్టోబర్‌ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్‌ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. 

Advertisement
 
Advertisement
Advertisement