
అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
బెంగళూరు నుంచి కల్లితండా వరకూ జగన్‌కు అడుగడుగునా నీరాజనం
రోడ్డుకు ఇరువైపులా నిలబడి ‘జై జగన్’ అంటూ నినాదాలు
కల్లితండాకు తరలివచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు
వైఎస్ జగన్ రాకతో భావోద్వేగానికి గురైన మురళి తండ్రి శ్రీరామ్‌నాయక్
లే.. మురళి.. జగన్ సర్ వచ్చాడు.. లేచి సెల్యూట్ చేయి అంటూ కన్నీరు
సాక్షి, పుట్టపర్తి : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగి్నవీర్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైఎస్ జగన్ కొనియాడారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీనాయక్ ఇంట్లోకి వైఎస్ జగన్ రాగానే.. జవాన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. జగన్ రాకతో కల్లితండా జనసంద్రంలా మారింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
కల్లితండా.. కన్నీరు మున్నీరు..
నాలుగైదు రోజులుగా దిగమింగుకున్న బాధను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఒక్కసారిగా భావోద్వేగంతో వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో మురళీ నాయక్ త్యాగాన్ని దేశం గరి్వంచినా.. కన్నతల్లి కంట కన్నీరు మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు జాతీయ జెండాలతో తరలివచ్చారు. గోరంట్ల – పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు దూరం ఉన్న కల్లితండాకు వచ్చేందుకు గంటకుపైగా సమయం పట్టింది.
గత సర్కారు సంప్రదాయమే..
దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని మొదట ప్రతిపాదన తీసుకొచ్చి.. అమలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.
మార్మోగిన ‘జై జవాన్’ నినాదం..
కల్లితండాలోకి వైఎస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి ‘జై జవాన్’ నినాదం మార్మోగింది. ‘భారత్ మాతాకీ జై.. మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. మురళీనాయక్ కుటుంబాన్ని మద్దతుగా నిలిచిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళి కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి జనం రాక..
వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మురళీ నాయక్‌కు ఘన నివాళులర్పించారు.
తరలివచ్చిన నేతలు..
వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపుర జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరలక్కప్ప (మడకశిర), టీఎన్ దీపిక (హిందూపురం), మక్బుల్ (కదిరి), మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మహాలక్ష్మి శ్రీనివాసులు, కోగటం విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
‘‘జగనన్నా.. వచ్చావా.. మురళీ ఎక్కడ అన్నా. నువ్వయినా మా బిడ్డ మురళీని వెంట తెస్తావనుకున్నా’’
– వైఎస్ జగన్ పరామర్శించగానే బోరున విలపిస్తూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆక్రందన
‘‘మురళీ.. పైకి లేచి సెల్యూట్ చేయి.. నీ కోసం జగన్ సర్ వచ్చాడు. మన ఇంటికే జగన్ సర్ వచ్చాడు మురళీ. లే మురళీ.. లేచి సెల్యూట్ చేయి మురళీ’’
– వైఎస్ జగన్‌ను చూడగానే మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ భావోద్వేగం
‘‘మురళీ నాయక్‌ను అయితే తేలేను తల్లీ.. నీ బిడ్డ పోరాటం వృథా కాదు. ఎంతోమందికి రక్షణగా నిలిచి.. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మురళీ త్యాగానికి రుణపడి ఉంటాం’’
– మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘జై జవాన్’ నినాదం మార్మోగింది.
కుగ్రామం కల్లితండాలో జనసునామీ పోటెత్తింది.
అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని
పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత
వైఎస్ జగన్ మంగళవారం రాగా... అభిమాన గణం
వెంట నడిచి జవాన్‌కు అశ్రు నివాళులర్పించింది.